చిత్రపరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీపై హైదరాబాద్ నగర పోలీసులు పైచేయి సాధించారు. ఈ పైరసీకి మూలకారకుడుగా ఉన్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన జైలుకు తరలించారు. ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అయితే, నటుడు శివాజీ మాత్రం మరోలా స్పందించారు. ఇమ్మడి రవి తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. రవి ఇకనైనా మారాలని హితవు పలికారు.
ఐబొమ్మ ద్వారా తాను చాలామందికి ఉపయోగపడుతున్నానని రవి భావించివుండొచ్చని, కానీ, అది ఎంతో మందిని ఇబ్బంది పెట్టిందని అన్నారు. మనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. రవిలో ఇప్పటికైనా మార్పు రావాలని శివాజీ ఆకాంక్షించారు. సినిమాను థియేటర్‌లో చూసే అనుభూతి మరెక్కడా రాదన్నారు.
ప్రపంచంలో అన్నిటికంటే చౌకైనది ఏదైనా ఉందంటే అది సినిమా మాత్రమేనని చెప్పారు. మూడు గంటల సినిమా నచ్చితే జీవితాంతం గుర్తుండిపోతుందని, ఇందుకు ఉదాహరణే సీనియర్ ఎన్టీఆర్ నటించిన మిస్సమ్మ, పాతాళభైరవి వంటి చిత్రాలన్నారు. ఇప్పటికైనా పైరసీని ప్రోత్సహించకుండా, సినిమాను థియేటర్‌లో చూడాలని శివాజీ విజ్ఞప్తి చేశారు.