ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడివుంది. ఈ ద్రోణి తెలంగాణ, కర్నాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది.
కాగా, ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ సంస్థ తెలిపింది. రాయలసీంలోనూ ఇదే తరహాలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 25వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
కాగా, ఏపీలో రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని, ఆ తర్వాత స్వల్పంగా తగ్గవచ్చని పేర్కొంది.