Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆనందయ్య మందులో హాని చేసే పదార్థాలేవీ లేవు : ఏపీ ఆరోగ్య శాఖ

Advertiesment
Anil Kumar Singhal
, ఆదివారం, 23 మే 2021 (19:44 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో బోణిగి ఆనందయ్య కరోనా రోగుల కోసం ఇస్తున్న ఆయుర్వేద మందులో హాని కలిగించే పదార్థాలేవీ లేవని ఏపీ వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మందు పరిశీలన కోసం వెళ్లిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడామని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆనందయ్య మందు నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపామన్నారు. మందులో నష్టం కలిగించే పదార్థాలు లేవని తేలిందని చెప్పారు. ఆయుర్వేదిక్ మెడిసిన్‌ని టెస్ట్ చేసి తీరాల్సిందేనన్నారు. 
 
కేంద్ర ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ వారితో కూడా మాట్లాడామని, ఈ మందు వాడినవారిపై ఎలాంటి ప్రభావం ఉందో డేటా సేకరిస్తున్నామని ప్రకటించారు. ఆయుర్వేదిక్ మెడిసిన్‌గా నోటిఫై చేయకుండా ఉంటే.. దానికి అనుమతులు అవసరం లేదని చెప్పారు. దీనిపై నివేదిక వచ్చాకా క్లారిటీ వస్తుందని అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
 
మరోవైపు, కరోనాకు విరుగుడుగా తాను అందిస్తున్న మందుపై సీఎం జగన్‌ సానుకూలంగా ఉన్నారని ఆనందయ్య అన్నారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తానన్నారు. తన మందు ఆయుర్వేదమేనని ఆయన కుండబద్దలు కొట్టారు.
 
ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారుచేశానని, వేల మందికి మందు తయారు చేయాలంటే సమయం పడుతుందన్నారు. కోటయ్యకు మందు వేసి నాలుగు రోజులైందని, తన మందు వల్లే కోటయ్య ఇబ్బందిపడ్డారని చెప్పలేమన్నారు. తన మందును కొందరు అమ్మే ప్రయత్నం చేస్తున్నానని, అమ్మేవారిని కట్టడి చేయాలని కోరారు. 
 
ఇదిలావుండగా, ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 18,767 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన కేసులతో కలిపి ఏపీలో 15,80,827కి కరోనా కేసులు చేరాయి. 
 
గడిచిన 24 గంటల్లో కరోనాతో 104 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 10,126 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 2,09,237 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 13,61,464 మంది రికవరీ అయ్యారు.
 
ఇక చిత్తూరు 15, పశ్చిమగోదావరి జిల్లాలో 13, విజయనగరం 11, విశాఖలో 9 మంది మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలులో 8 మంది చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం 7, నెల్లూరు 6, కడప జిల్లాలో ముగ్గురు కరోనాతో మృతి చెందారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాస్ రూపంలో మరో ముప్పు... అప్రమత్తమైన కేంద్రం