ఏపీలో రేషన్ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఏటీఎం కార్డులను పోలిన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టడమే కాకుండా, వాటిలో ఏమైనా తప్పులుంటే సులువుగా సరిచేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ నూతన విధానాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏటీఎం కార్డులను పోలిన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టడమే కాకుండా.. వాటిలో ఏమైనా తప్పులుంటే సులువుగా సరిచేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, కొత్తగా జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత కార్డుల్లో పేర్లు లేదా ఇతర వివరాల్లో తప్పులు దొర్లితే గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
అంతేకాకుండా ఈ నెల 15వ తేదీ నుంచి మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా ఈ మార్పులు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. తప్పులను సరిచేసిన తర్వాత లబ్ధిదారులకు కొత్త కార్డులను ముద్రించి అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఆధార్, ఈ-కేవైసీ వివరాల ఆధారంగా ఈ కొత్త కార్డులను రూపొందించినట్లు నాదెండ్ల పేర్కొన్నారు. అయితే, వరుసగా మూడు నెలల పాటు రేషన్ సరకులు తీసుకోని కుటుంబాలకు నాలుగో నెల నుంచి పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తారని స్పష్టం చేశారు.
అలాంటి వారు తమ కార్డును సచివాలయాల్లో చూపించి తిరిగి యాక్టివేట్ చేయించుకోవాల్సి ఉంటుందని సూచించారు. నవంబర్ 1 తర్వాత కొత్త కార్డు కావాలనుకునే వారు రూ.35 నుంచి రూ.50 వరకు రుసుము చెల్లిస్తే, కార్డును నేరుగా ఇంటికే పంపిణీ చేస్తారని వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ స్మార్ట్ కార్డులపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుల పూర్తి వివరాలు, చిరునామా, డిపో ఐడీ వంటివి తక్షణమే తెలుసుకోవచ్చు.