తితిదే మాజీ చైర్మన్, వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి అలిపిరి పోలీసులు నోటీసులు పంపిచారు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఒక విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ రెండు రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు, షేర్ చేసిన వీడియో వివాదాస్పదమైంది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులోభాగంగా, ఆయనకు అలిపిరి పోలీసులు 41ఏ కింద నోటీసులు పంపించారు.
ఈ కేసు విచారణ నిమిత్తం గురువారం తిరుపతి డీఎస్పీ కార్యాలయంలో హాజరుకావాలని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, తాను కొన్ని రోజుల పాటు వ్యక్తిగత పనుల కారణంగా బిజీగా ఉంటానని ఆ నోటీసులు ఇచ్చిన పోలీసులకు భూమన తెలిపారు. దీనిపై స్పందించిన ఎస్ఐ అజిత ... వీలు చూసుకుని విచారణకు రావాలని సూచించారు. అనంతరం వచ్చే మంగళవారం అంటే ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరువుతానని భూమన పోలీసులకు స్పష్టం చేసినట్టు సమాచారం.
కొన్ని రోజుల క్రితం అలిపిరి సమీపంలోని ఒక విగ్రహం విషయంలో భూమన చేసిన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై తితిదే డిప్యూటీ ఈవో గోవిందరాజు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసి, తాజాగా నోటీసులు పంపించారు.