Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కస్టోడియల్ టార్చర్ చేసినవారంతా జైలుకు వెళ్లడం ఖాయం : ఆర్ఆర్ఆర్

Advertiesment
raghurama krishnamraju

ఠాగూర్

, గురువారం, 28 నవంబరు 2024 (17:05 IST)
తనను కస్టోడియల్ టార్చర్ చేసిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని ఏపీ డిప్యూటీ స్పీకర్, వైకాపా మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏపీ సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అరెస్టుపై ఫిర్యాదుదారుడైన రఘురామకృష్ణంరాజు స్పందించారు. విజయపాల్ అరెస్టును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలని సూచించారు. అలాగే, ఈ కేసులో సంబంధం ఉన్న వారందరూ అరెస్టు కాక తప్పదని ఆయన అన్నారు. కాగా, ఆర్ఆర్ఆర్‌ను కస్టడీలో వేధించిన కేసులో మంగళవారం విజయపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
'ఆర్ఆర్ఆర్‌'పై థర్డ్ డిగ్రీ ప్రయోగం... కటకటాల వెనక్కి సీఐడీ మాజీ ఏఎస్పీ 
 
గత వైకాపా ప్రభుత్వంలో పాలకుల అండ చూసుకుని రెచ్చిపోయిన పోలీసు అధికారులు ఇపుడు చిక్కుల్లో పడ్డారు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును గత వైకాపా ప్రభుత్వంలో అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐడీ మాజీ అడిషినల్ ఎస్పీ విజయపాల్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రఘురామను ఏ విధంగా అయితే కొన్ని గంటల పాటు సుధీర్ఘంగా విచారించి విజయపాల్ అరెస్టు చేశారు. ఇపుడు ఇదే రీతిలో విజయ్ పాల్ అరెస్టు కావడం గమనార్హం. 
 
రఘురామను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని సీఐడీ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా, సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ దీనికి సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు. మంగళవారం విజయపాల్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కాగా... సాయంత్రం వరకు సుదీర్ఘంగా విచారించిన పోలీసులు... ఆయనను అరెస్టు చేశారు. 
 
రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారిగా ఉన్నారు. విజయపాల్ నవంబరు 13న పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కానీ ఆయన నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం సేకరించలేకపోయారు. దాంతో ఇవాళ కూడా విచారించి, అరెస్టు చేశారు.
 
విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే విజయపాల్ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఆయన అరెస్టుకు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థల పరిశీలన : మంత్రి టీజీ భరత్