Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా?

Advertiesment
bus burn in fire accident

ఠాగూర్

, శుక్రవారం, 24 అక్టోబరు 2025 (10:03 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరికొంతమంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు నగరానికి వెళుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ ప్రైవేట్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదానికి గురైంది. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది ఇపుడు మిస్టరీగా మారింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... 
 
వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగుళూరు నగరానికి బయలుదేరింది. ఈ బస్సు కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో కల్లూరు మండలం చిన్నటేకూరు వద్దకు రాగానే, వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఓ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో బస్సు ముందు భాగంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
 
ప్రయాణికుల్లో చాలామంది గాఢనిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో గ్రహించేలోపే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడి బస్సు మొత్తం వ్యాపించాయి. కొందరు ప్రయాణికులు అప్రమత్తమై, అత్యవసర ద్వారాన్ని పగలగొట్టుకుని బయటపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలతో బయటపడగా, వారికి కూడా గాయాలయ్యాయి.
 
దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి - ప్రధాని - బాబు - పవన్ తీవ్ర దిగ్బ్రాంతి