Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుర్గగుడిలో ఆటోమేటిక్ లడ్డూ విక్రయ కేంద్రం - ప్రయోగాత్మకంగా ప్రారంభం

Advertiesment
Kanakadurga Temple
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా దుర్గగుడిలో స్వయంచాలక లడ్డూ విక్రయ యంత్రాన్ని వినియోగించడం ప్రశంసనీయమని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ చెప్పారు. శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం సెంట్రల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెంటట్‌ ప్రాంగణంలో(అర్జున వీధి) రూ.6 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రాన్ని పాలకమండలి ఛైర్మన్‌ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌లతో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిజిటలైజేషన్‌లో భాగంగా ఇప్పటికే ప్రధాన దేవాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించామన్నారు. దర్శనం టిక్కెట్లు, ఆర్జిత సేవలు, దేవస్థానం సమాచారాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తునికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా దుర్గగుడిలో భక్తుడు ఎవరి సహకారం లేకుండా చరవాణితో క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి తనకు ఎన్ని లడ్డూ బాక్సులు కావాలో నేరుగా పొందేందుకు ఏటీఎం తరహా లడ్డూ యంత్రాలు ఉపయోగపడతాయన్నారు. 
 
ఈ ప్రయోగాన్ని భవిష్యత్‌లో ఇతర ప్రధాన దేవాలయాల్లో సైతం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పైలెట్‌ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత మరిన్ని ప్రాంతాల్లో మిషన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దసరా ఉత్సవాల్లో మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో ఆర్జిత సేవలు నిర్వహించాలని, మూలా నక్షత్రం రోజున పూజ చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ పాలకమండలి సభ్యులు ఇచ్చిన వినతి పత్రాన్ని ఛైర్మన్‌ రాధాకృష్ణ ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ధర్మారావు, శ్రీనివాసరావు, రాఘవరాజు, శంకర్‌బాబు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటిన వాయుగుండం - 48 గంటల పాటు అతి భారీ వర్షాలు