Publish Date: Thursday, 23 December 2021 (11:43 IST)
Updated Date: Thursday, 23 December 2021 (11:47 IST)
వైఎస్ వివేకా మాజీ డ్రైవర్, హత్య కేసు నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి వివేకా హత్య జరిగిన తీరును బయటపెట్టిన విషయం తెలిసిందే. వివేకాను గొడ్డలితో నరికి, గుండెలపై బాది దారుణంగా హత్య చేసినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే.. వివేకా హత్య కేసులో అసలు సూత్రధారి వేరంటూ మరో సంచలన విషయం బయటపడింది. వివేకాను ఆయన సొంత అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డే హత్య చేయించారంటూ.. ప్రధాన నిందితుల్లో ఒకరైన సునీల్ కుమార్ యాదవ్కు అత్యంత సన్నిహితుడైన భరత్ యాదవ్ షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.
ఆస్తి కోసమే వైఎస్ వివేకా హత్య జరిగిందని.. దీనికి ప్రత్యేక సూత్రధారుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డేనంటూ భరత్ యాదవ్ ఆరోపించాడు. వివేకానంద రెడ్డి సన్నిహితురాలు షమీంకు ఆస్తి వెళ్తుందనే ఉద్దేశంతోనే ఆయన్ను హత్య చేశారని.. ఈ విషయాలన్నీ సునీల్ యాదవే నేరుగా తనకు చెప్పినట్లు మీడియా ఎదుట వివరించారు.
ఇన్నాళ్లూ ప్రాణభయంతోనే ఈ విషయాలు ఎవ్వరికీ చెప్పలేదని.. తనకు తెలిసిన అన్ని విషయాలను బయటపెడుతున్నానంటూ భరత్ యాదవ్ మీడియా ఎదుట వివరించారు.