Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో మతస్వేచ్ఛ లేదా.. ట్రంప్ సర్కారు ఏమంటోంది?

Advertiesment
Donald Trump
, శనివారం, 22 ఫిబ్రవరి 2020 (13:00 IST)
అమెరికా అధ్యక్షుడు వచ్చే సోమవారం భారత్‌కు రాబోతున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన సాగుతుంది. భారత్‌లో ఆయనకు అపూర్వ స్వాగతం లభించబోతుందని అమెరికా భావిస్తోంది. గత కొన్నేళ్లలో విదేశీ నేతలెవరికీ లభించనంత ఘనంగా ట్రంప్‌కు స్వాగతం ఉంటుందని అమెరికా అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్యపరమైన భిన్నాభిప్రాయాలను తొలగించుకునేందుకు ట్రంప్ పర్యటన దోహదపడుతుందని అంటున్నారు.
 
అయితే, శుక్రవారం అమెరికా ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత పర్యటన సమయంలో బహిరంగ ప్రసంగాల్లో, అంతర్గత చర్చల్లో ట్రంప్ మత స్వేచ్ఛ అంశం గురించి మాట్లాడొచ్చని చెప్పారు. ‘‘ఇరు దేశాలు పంచుకుంటున్న ప్రజాస్వామ్య, మత స్వేచ్ఛ సంప్రదాయం గురించి ట్రంప్ బహిరంగంగా, ప్రైవేటుగా మాట్లాడతారనే అనుకుంటున్నా. ఆయన ఈ అంశాలు లేవనెత్తుతారు, ముఖ్యంగా మత స్వేచ్ఛ అంశం గురించి మాట్లాడతారు. మా ప్రభుత్వానికి ఇది చాలా ముఖ్యమైన అంశం’’ ఆ సీనియర్ అధికారి అన్నారు.
Donald Trump
 
భారత్‌లో పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ సిటిజెన్‌షిప్ రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ)లపై ముస్లింల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆ సీనియర్ అధికారి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ‘‘ప్రధాని మోదీతో ట్రంప్ ఈ విషయాల గురించి మాట్లాడతారు. ప్రజస్వామ్య సంప్రదాయాలను, మతపరమైన మైనార్టీలను గౌరవించడాన్ని అలాగే కొనసాగించాలని భారత్ వైపు ప్రపంచం చూస్తోంది. భారత రాజ్యాంగంలోనే మత స్వేచ్ఛ, మతపరమైన మైనార్టీలను గౌరవించడం, మతాలన్నింటినీ సమానంగా చూడటం ఉంది’’ అని ఆ అమెరికా సీనియర్ అధికారి అన్నారు.
 
రాజకీయ, వ్యూహాత్మక అంశాల్లో సన్నిహిత భాగస్వాములుగా ఉన్న భారత్, అమెరికా గత కొన్నేళ్లుగా పరస్పరం వాణిజ్య సుంకాలు విధించుకుంటూ వస్తున్నాయి. ఈ విషయంలో ఓ అంగీకారానికి వచ్చేందుకు గత నెల రోజులుగా రెండు దేశాల అధికారులు సంప్రదింపులు జరుపుతున్నా, అవి ఓ కొలిక్కి రాలేదు.
 
భారత్‌లో పెద్దవైన పౌల్ట్రీ, డెయిరీ మార్కెట్లలో అడుగుపెట్టేందుకు అమెరికా అనుమతి కోరుకుంటోంది. దేశంలో అమ్ముడయ్యే వైద్య పరికరాల ధరలను భారత్ నియంత్రిస్తోంది. అమెరికా టెక్ సంస్థలను భారత్‌లోనే డేటా స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకుకోవాలని చెబుతోంది. అలా చేస్తే, ఖర్చులు పెరుగుతాయని ఆ సంస్థలు అంటున్నాయి.
Donald Trump
 
భారత్‌కు ఇచ్చే వాణిజ్య మినహాయింపులను 2019లో ట్రంప్ ప్రభుత్వం ఆపేసింది. వీటిని మళ్లీ తీసుకురావాలని భారత ప్రధాని మోదీ అమెరికాను అడుగుతున్నారు. దేశంలో తయారయ్యే ఔషధాలు, వ్యవసాయోత్పత్తులను అమెరికా మార్కెట్లో ఏ ఆంక్షలు లేకుండా అమ్ముకునే అవకాశం కల్పించాలని కూడా భారత్ ఆశిస్తోంది. రెండు దేశాల మధ్య భిన్నాభిప్రాయులున్న అంశాలివే. అమెరికా చైనాను చూసినట్లుగానే తమను చూడొద్దని భారత్ కోరుకుంటోంది. ఎందుకంటే, భారత్ కన్నా చైనాది ఐదు రెట్లు పెద్ద ఆర్థికవ్యవస్థ.
 
ట్రంప్ ప్రభుత్వం ఏమంటోంది.. 
ట్రంప్ పర్యటనలో వాణిజ్య ఒప్పందమూ ఏదీ ఉండదని అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి చెప్పారు. ‘‘భారత్‌లో వాణిజ్యపరమైన ఆంక్షలు పెరుగుతుండటంపై అమెరికా ఇంకా ఆందోళనతో ఉంది. మేం దీనికి పరిష్కారాలు కోరుకుంటున్నాం. ఇంకా వాటిని సాధించలేకపోయాం’’ అని అన్నారు.
Donald Trump
 
‘‘ఈ ఆందోళన వల్ల భారత్‌కు ఇచ్చే వాణిజ్య మినహాయింపులు ఆగిపోయాయి. భారత్ మార్కెట్‌‌ను చేరుకునేందుకు న్యాయమైన, సమానమైన అవకాశాన్ని మాకు కల్పించడంలో భారత్ పూర్తిగా విఫలమైంది’’ అని వ్యాఖ్యానించారు. ఇక భారత్, పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల గురించి కూడా ఆ అధికారి మాట్లాడారు.
 
‘‘భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే విషయంపై ట్రంప్ ఆసక్తితో ఉన్నారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన రెండు దేశాలను ప్రోత్సహిస్తారు. పాకిస్తాన్ తమ భూభాగంలోని ఉగ్రవాదులను నియంత్రించేందుకు చేపట్టే చర్యల పునాదులపైనే చర్చలు అర్థవంతంగా సాగుతాయని కూడా మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలవరం గ్రౌండ్‌ రిపోర్ట్: జగన్ పాలనలో పనులు ఎలా జరుగుతున్నాయి?