Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిత్యానంద సొంత దేశం... కైలాస: ‘మాది రాజకీయేతర హిందూ దేశం' - ప్రెస్ రివ్యూ

Advertiesment
Nityananda
, బుధవారం, 4 డిశెంబరు 2019 (17:16 IST)
అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద సొంతంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారని.. ఈక్వెడార్‌ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి 'కైలాస' అనే పేరు కూడా పెట్టారని 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.


ఆ కథనం ప్రకారం.. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు దగ్గర్లో ఉన్న తన ద్వీప దేశానికి నిత్యానంద ఒక పాస్‌పోర్ట్‌ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని డిజైన్‌ చేశారు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజూ కేబినెట్‌ భేటీలు కూడా జరుపుతున్నారని సమాచారం.

 
ప్రధానిగా 'మా'ని నియమించారని, గోల్డ్, రెడ్‌ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని ఆ 'దేశ' వెబ్‌సైట్‌ పేర్కొంది. తన 'కైలాస'కు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నారు.

 
హిందూత్వని ప్రచారం చేస్తున్నందువల్ల భారత్‌లో తన జీవితం ప్రమాదంలో పడిందని ఐరాసకు పంపనున్న వినతి పత్రంలో నిత్యానంద పేర్కొన్నారు. కైలాస రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తుందని ఆ వెబ్‌సైట్లో చెప్పారు. తమ దేశ పౌరసత్వం కావాలనుకునేవారు విరాళాలు ఇవ్వాలనే విజ్ఞప్తిని కూడా అందులో పొందుపర్చారు.

 
మెరూన్‌ కలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సింహాసనం ముందు నిత్యానంద కూర్చుని ఉండగా పక్కన నంది ఉన్న చిత్రంతో జెండాను రూపొందించారు. ప్రభుత్వంలో 10 శాఖలను కూడా ఏర్పాటుచేశారు. అందులో ఒకటి నిత్యానంద స్వామి కార్యాలయం కాగా, విదేశీ వ్యవహారాలు, రక్షణ, సోషల్‌ మీడియా, హోం, కామర్స్, విద్య.. మొదలైన ఇతర శాఖలు ఉన్నాయి.

 
తమది సరిహద్దులు లేని దేశమని, తమ తమ దేశాల్లో స్వేచ్ఛగా హిందూయిజాన్ని అనుసరించలేని వారి కోసం ఈ దేశం ఏర్పాటయిందని కైలాస వెబ్‌ సైట్లో పేర్కొన్నారు. తమ దేశంలో ఉచితంగానే భోజనం, విద్య, వైద్యం లభిస్తాయని, ఆధ్యాత్మిక విద్య, ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై దృష్టి పెడతామని ఆ వెబ్‌సైట్లో పేర్కొన్నారు.

 
'మాది భౌగోళికపరమైన దేశం కాదు. ఒక భావనాత్మక దేశం. శాంతి, స్వేచ్ఛ, సేవాతత్పరతల దేశం. ఏ దేశ ఆధిపత్యం కిందా లేని మేం ఇతర దేశాలతో, అంతర్జాతీయ సంస్థలతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాం' అని అందులో తెలిపారు. నకిలీ పాస్‌పోర్ట్‌తో, నేపాల్‌ మీదుగా ఇటీవల నిత్యానంద పారిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శబరిమలకు ఎందుకు వెళ్లకూడదంటే.. భార్యకు వివరించిన పవన్ కళ్యాణ్