Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాచుపాము విషానికి చౌకైన విరుగుడు గుర్తించిన శాస్త్రవేత్తలు

Advertiesment
Snake

బిబిసి

, గురువారం, 18 జులై 2024 (15:14 IST)
చిక్కటి రక్తాన్ని పలుచగా చేసేందుకు సాధారణంగా ఉపయోగించే ఔషధం తాచుపాము విషానికి విరుగుడుగా పని చేస్తుందని ఆస్ట్రేలియా, కెనడా, కోస్టారికా, బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం కనిపెట్టింది. ఆఫ్రికా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో పాము కాటు వల్ల ఏటా 1,38,000 మంది చనిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలవారు, పేదలు ఉన్నారు. పాము కాటు బారిన పడిన వారిలో 4 లక్షల మందికి నెక్రోసిస్ అనే ఆరోగ్య సమస్య వస్తోంది. నెక్రోసిస్ అంటే పాము కరిచిన చోట చర్మంలోని కణజాలం చనిపోయి నల్లగా మారుతుంది. ఆఫ్రికా దేశాలు, ఇండియాలో ఎక్కువ మంది తాచుపాముల కాటుకు గురవుతున్నారు.
 
తాచు పాములు కరిచినప్పుడు, శరీరంలోకి విషం చిమ్మగానే విషం తీవ్రత వల్ల ఏర్పడే నెక్రోసిస్‌ను నయం చెయ్యడంలో హెపారిన్ అనే ఔషధం బాగా పని చేస్తోంది. అయితే ఈ మందు అన్ని రకాల పాముల విష ప్రభావాన్ని తగ్గించలేదు. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రకాల యాంటీ వీనమ్ మందుల కంటే చౌకైనదని మరింత ప్రభావవంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న యాంటీ వీనమ్ ఔషధాల్లో ఎక్కువ శాతం కొన్ని ప్రత్యేక పాముల విషానికి విరుగుడుగా మాత్రమే పని చేస్తాయి. ఇవి నెక్రోసిస్‌ను తగ్గించలేవు. హెపారిన్‌ను ఎలుకల మీద ప్రయోగాత్మకంగా పరీక్షించారు. త్వరలో మనుషుల మీద ప్రయోగించనున్నారు.
 
అంతర్జాతీయ పోరాటం
"తాచుపాము కరిచిన చోట చర్మం నల్లగా మారడం, పాము కరిచినప్పుడు ఏర్పడే గాయాలను నయం చెయ్యడంలో మేం కనుక్కున్న విషయాలు ఉపయోగపడతాయి. అంతే కాకుండా పాము కరిచిన తర్వాత శరీరంలో విషం వేగంగా విస్తరించకుండా ఈ ఔషధం ఆపగలుగుతుంది. తాచు పాము కాటుకు గురయినవారు బతికే అవకాశాలను మెరుగు పరుస్తుంది" అని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ప్రొఫెసర్ గ్రెస్ నీలే చెప్పారు. "విషం, విషరసాయనాలు లాంటివి చర్మంపైన కణజాలం, రక్తం వంటి వాటి ద్వారా శరరంలో విస్తరిస్తాయి. ముందుగా విషం ప్రభావం చర్మంలోని కణజాలంపై ఉంటుంది. తర్వాత రక్తంలోకి చేరుతుంది. వివిధ రకాల పాములలో విషాలను పరీక్షించినప్పుడు అందులో కొన్ని మాత్రమే మానవ కణజాలంతో కలుస్తున్నట్లు గుర్తించాం" అని ఆయన చెప్పారు.
 
పాము కరిచినప్పుడు విషం చర్మ కణజాలంలోకి ఎలా చేరుతుందనే దానిపై మేం నాలుగైదు మార్గాలను గుర్తించగలమని అనుకుంటున్నాం. శాస్త్ర పరిజ్ఞానం దృష్ట్యా ఇది చాలా మంచి విషయం. అది తెలుసుకోగలిగితే ప్రపంచవ్యాప్తంగా అందరికీ, అన్ని రకాల విషాలకు విరుగుడు ఔషధాన్ని కనుక్కోవచ్చని భావిస్తున్నాం" అని గ్రెస్ నీలే చెప్పారు.
 
శాశ్వత వైకల్యం
ఇదొక పెద్ద ముందడుగని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ‌లో పీహెచ్‌డీ విద్యార్ధి టియన్ డు చెప్పారు. "హెపారిన్ అంత ఖరీదైనది కాదు. అన్నిచోట్లా దొరుకుతుంది కూడా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన అత్యవసర ఔషధం ఇది" అని ఆమె అన్నారు. "మనుషులపై పరీక్షలు విజయవంతం అయిన తర్వాత తాచుపాము కాటుకు ఇది సులువైన, సురక్షితమైన, ప్రభావవంతమైన ఔషధంగా మార్కెట్‌లోకి వస్తుంది’ అని లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ సెంటర్ ఫర్ స్నేక్ బైట్‌ రీసర్చ్ అండ్ ఇంటర్వెన్షన్స్ హెడ్ ప్రొఫెసర్ నికొలస్ కేస్‌వెల్ చెప్పారు.
 
"మనం కనుక్కున్న అంశాలు ఉత్సాహపూరితంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న విషానికి విరుగుడు మందులు కొన్ని ప్రాంతాలలో ప్రభావం చూపలేకపోతున్నాయి. వీటి వల్ల పాము కరిచిన చోట వాపు రావడం, చర్మ కణజాలం చనిపోయి నల్లగా మారడం, చర్మంపై దద్దుర్లు లాంటివి ఏర్పడుతున్నాయి" అని ఆమె తెలిపారు. దీని వల్ల కొన్ని అవయవాలు పని చేయని పరిస్థితి ఏర్పడుతోంది. తర్వాతి కాలంలో వాటిని తొలగించాల్సి రావడంతో అది శాశ్వత వైకల్యానికి దారి తీస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ రైతుల రుణమాఫీ.. నెలాఖరులోగా రూ.31 వేల కోట్లు విడుదల