Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలి టెస్టులో చతికిలపడ్డారు కదా.. షాకింగ్ మార్పులు తప్పవు

భారత జట్టు కెప్టెన్‌గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా గత 22 టెస్టుల్లో విరాట్‌ కోహ్లి ఒక మ్యాచ్‌లో ఆడిన తుది జట్టును తర్వాతి మ్యాచ్‌లో కొనసాగించలేదు. ప్రతీసారి కనీసం ఒక ఆటగాడినైనా మారుస్తూ వచ్చాడు. పుణేలో సమష్టి వైఫల్యం నేపథ్యంలో ఇప్

Advertiesment
Indian team
హైదరాబాద్ , శనివారం, 4 మార్చి 2017 (06:21 IST)
భారత జట్టు కెప్టెన్‌గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా గత 22 టెస్టుల్లో విరాట్‌ కోహ్లి ఒక మ్యాచ్‌లో ఆడిన తుది జట్టును తర్వాతి మ్యాచ్‌లో కొనసాగించలేదు. ప్రతీసారి కనీసం ఒక ఆటగాడినైనా మారుస్తూ వచ్చాడు. పుణేలో సమష్టి వైఫల్యం నేపథ్యంలో ఇప్పుడు కూడా జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లి స్వయంగా చెప్పినట్లు ఇవి ‘ఆశ్చర్యకరంగా’ ఉండవచ్చు. అందుకోసం తాను మొదటి నుంచి జపిస్తున్న ఐదుగురు బౌలర్ల మంత్రాన్ని పక్కన పెడతాడా అనేది చూడాలి. 
తొలి టెస్టులో భారత బ్యాటింగ్‌ పూర్తిగా విఫలమైంది. కాబట్టి అదనపు బ్యాట్స్‌మన్‌ అవసరం కనిపిస్తోంది. అప్పుడు కరుణ్‌ నాయర్‌కు చోటు కల్పించే అవకాశం ఉంది. అదే జరిగితే గత మ్యాచ్‌లో విఫలమైన ఆల్‌రౌండర్‌ జయంత్‌ యాదవ్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడి పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం కాబట్టి భారత్‌ సాధ్యమై నంత భారీ స్కోరు సాధిస్తేనే మ్యాచ్‌పై పట్టు చిక్కు తుంది. ఈ మైదానంలో చక్కటి రికార్డు ఉన్న విజయ్, పుజారాలతో పాటు ‘హోం బాయ్‌’ లోకేశ్‌ రాహుల్‌ కూడా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.
 
ఇంగ్లండ్‌ సిరీస్‌ నుంచి చూస్తే బంగ్లాదేశ్‌తో టెస్టు మినహా అన్నింటిలో విఫలమైన రహానేకు ప్రస్తుతానికైతే కెప్టెన్, కోచ్‌ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. కానీ దీనిని నిలబెట్టుకునేందుకు రహానే ఆ స్థాయి ఇన్నింగ్స్‌ ఒకటి ఆడాల్సి ఉంది. ఇక విరాట్‌ కూడా గత మ్యాచ్‌ అరుదైన వైఫల్యం తర్వాత తనకూ సొంత గ్రౌండ్‌లాంటి ఈ వేదికపై గొప్ప ఇన్నింగ్స్‌ ఆడితే భారత్‌కు మ్యాచ్‌లో విజయావకాశాలు ఖాయంగా ఉంటాయి. 
 
పిచ్‌ మారుతున్న కొద్దీ చివర్లో కీలకపాత్ర పోషించాల్సిన అశ్విన్, జడేజాలు గత మ్యాచ్‌ పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నారు. పేసర్లలో ఉమేశ్‌ ఖాయం కాగా, రివర్స్‌ స్వింగ్‌కు అవకాశం ఉంటే ఇషాంత్‌ స్థానంలో భువనేశ్వర్‌ రావచ్చు. ఏదేమైనా గత మ్యాచ్‌లో కలిసికట్టుగా విఫలమైన టీమిండియా, ఈసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిస్తేనే ఈ టెస్టులో ఆధిక్యం ప్రదర్శించవచ్చు.
 
పుణే టెస్టులో గెలిచిన జట్టునే ఏ మాత్రం మార్పులు లేకుండా కొనసాగిస్తున్నట్లు ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించేసింది. అద్భుత విజయంతో ఆ జట్టులో ఉత్సాహం కనిపిస్తున్నా... ఏమరుపాటుగా వ్యవహరిస్తే పరాభవం తప్పదని ఆసీస్‌కు బాగా తెలుసు. అందుకే సిరీస్‌పై పట్టు సాధించేందుకు వచ్చిన కీలక అవకాశాన్ని ఆ జట్టు కోల్పోరాదని భావిస్తోంది. బ్యాటింగ్‌లో స్మిత్‌ ముందుండి నడిపిస్తుండగా, కొత్త కుర్రాడు రెన్‌షా ఆకట్టుకున్నాడు. అద్భుతంగా ఆడకపోయినా షాన్‌ మార్‌‡్ష, హ్యాండ్స్‌కోంబ్‌ కూడా మెరుగ్గానే ఆడారు. 
 
తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకునేలా ఈసారి మరింత బాగా ఆడాల్సిన బాధ్యత మరో ప్రధాన బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌పై ఉంది. ఈ విధ్వంసకర ఓపెనర్‌ ఒక్కసారి క్రీజ్‌లో నిలదొక్కుకుంటే మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగలడు. పుణేలో తొలి సెషన్‌లో అతని శైలిలో దూకుడు కూడా కనిపించింది. 
 
ఇక 12 వికెట్లతో క్రికెట్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన స్పిన్నర్‌ ఒకీఫ్‌ తనపై ఉన్న ఒత్తిడిని అధిగమించి మరోసారి భారత బ్యాట్స్‌మెన్‌ను నిరోధించగలడా చూడాలి. భారత్‌తో పోలిస్తే ఆసీస్‌ అదనపు బలం పేస్‌ బౌలింగ్‌లో కూడా ఉంది. ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్ల జాబితాలో ఉన్న మిషెల్‌ స్టార్క్, హాజల్‌వుడ్‌లు భారత్‌ను ఏ సమయంలోనైనా దెబ్బ తీయగల సమర్థులు. ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లలో ఎవరూ కూడా బెంగళూరులో టెస్టు మ్యాచ్‌ ఆడలేదు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లెక్క సరిచేస్తారా.. లెక్కలోకి లేకుండా పోతారా: నేడే రెండో టెస్టు ప్రారంభం