Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెప్టెన్‌ కోహ్లి చెప్పాడని కుంబ్లేను మారిస్తే బోర్డు గతేమిటి? కోచ్‌ మార్పుపై సందిగ్ధంలో బీసీసీఐ

భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కూడా చేయలేని సాహసానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దిగాడు. ఈ కోచ్ మాకొద్దు అని చెప్పడమే కాకుండా టీమ్ లోని పదిమంది ఆటగాళ్లను కూడగలుపుకుని వారిచేత కూడా కోచ్ అనిల్ కుంబ్లేకు వ్యతిరేక వ్యాఖ్యలు చేయించడంతో బీసీసీఐ ఈ

Advertiesment
Indian cricket coach
హైదరాబాద్ , శనివారం, 10 జూన్ 2017 (08:05 IST)
భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కూడా చేయలేని సాహసానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దిగాడు. ఈ కోచ్ మాకొద్దు అని చెప్పడమే కాకుండా టీమ్ లోని పదిమంది ఆటగాళ్లను కూడగలుపుకుని వారిచేత కూడా కోచ్ అనిల్ కుంబ్లేకు వ్యతిరేక వ్యాఖ్యలు చేయించడంతో బీసీసీఐ ఈ చిక్కుసమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లేది మచ్చలేని వ్యక్తిత్వం కావటంతో తనను పక్కన పెట్టడం చాలా క్లిష్ట సమస్యలకు దారితీస్తుంది. అలాగని కెప్టెన్ చెప్పాడని కుంబ్లేని కోచ్ పదవి నుంచి తీసివేస్తే బోర్డు పరిపాలక వ్యవహారాల్లోనూ కోహ్లీ అభిప్రాయానికి విలువ ఉంటుందనే సంకేతాలు పంపించినట్టవుతుందని, ఇది సరికాదని బీసీసీఐ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
 
ఈ నేపధ్యంలోనే భారత క్రికెట్‌ జట్టు నూతన కోచ్‌ ఎంపిక ఆలస్యం కానుంది. ప్రస్తుత కోచ్‌ అనిల్‌ కుంబ్లేను కొనసాగించాలా లేక మరొకరి పేరు ప్రకటించాలా అని నిర్ణయించేందుకు క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) మరికొంత సమయం కావాలనుకుంటోంది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లాలతో పాటు చాలా మంది సీనియర్‌ అధికారులు కుంబ్లే వైపు మొగ్గుచూపుతుండడంతో ఆయన్నే కొనసాగిస్తారా.. అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
కోచ్‌ ఎంపికపై గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లతో కూడిన సీఏసీ గురువారం సాయంత్రం సమావేశమై రెండు గంటలపాటు చర్చలు జరిపింది. అయితే ఈ విషయంలో స్పష్టత కోసం తమకు మరింత సమయం కావాలని బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రిని కమిటీ కోరింది. ‘సీనియర్‌ క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ ఎంపిక కోసం సీఏసీ గురువారం సమావేశమైంది. తగిన సమయంలో నిర్ణయం తీసుకుని తిరిగి బీసీసీఐకి తెలుపుతుంది’ అని బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి తెలిపారు.
 
గతేడాది జూలైలో కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి 17 టెస్టుల్లో 12 విజయాలను అందించిన కుంబ్లేను పక్కనపెట్టేందుకు సీఏసీ కూడా విముఖంగానే ఉంది. మరోవైపు ఈనెల 26న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) జరిగే వరకు కోచ్‌ వ్యవహారాన్ని వాయిదా వేయాలని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా కార్యదర్శికి లేఖ రాశారు. 
 
దీంతో చాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం కుంబ్లే అటునుంచి అటే విండీస్‌ పర్యటనకు కూడా వెళ్లే అవకాశాలుంటాయి. ఒకవేళ కుంబ్లే వెళ్లకుంటే సహాయక కోచ్‌ సంజయ్‌ బంగర్‌ జట్టుతో పాటు వెళతారు. నిజానికి కెప్టెన్‌ కోహ్లి చెప్పాడని కుంబ్లేను మారిస్తే బోర్డు పరిపాలక వ్యవహారాల్లోనూ తన అభిప్రాయానికి విలువ ఉంటుందనే సంకేతాలు పంపించినట్టవుతుందని, ఇది సరికాదని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క గేమ్ పోయింది.. కోహ్లీపై అందరూ ఫైర్.. పాక్‌ను చూసి నేర్చుకోమంటున్నారే..