Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమించుకున్నారు.. కానీ పెద్దలకు భయపడి కారులో ప్రేమ జంట ఆత్మహత్య!!

Advertiesment
car blaze

ఠాగూర్

, మంగళవారం, 7 జనవరి 2025 (09:14 IST)
వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. వీరి విషయం తెలుసుకున్న కొందరు పోకిరీలు వారిని వేధించసాగారు. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేశారు. అదేసమయంలో ఈ విషయం పెద్దలకు తెలిసింది. దీంతో యువతి ఇంట్లో గొడవలు ఉత్పన్నమయ్యాయి. ఈ క్రమంలో ఒకటిగా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఓ కారును అద్దెకు తీసుకుని ఔటర్ రింగ్ రోడ్డుపైకి చేరుకుని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ఆ ప్రేమ జంట కారులోనే యువతి బూడిదైపోయింది. మంటలను తట్టుకోలేక ప్రేమికుడు మాత్రం కేకలు వేస్తూ బయటకు వచ్చి కిందపడి ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీబీనగర్ మండలంలోని జమిలాపేటకు చెందిన శ్రీరాములు (25), ఘట్కేసర్ మండలం నారపల్లికి చెందిన బాలిక (17) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం బాలిక ఇంట్లో తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. బాలికను మందలించడంతోపాటు పలుమార్లు చేయి కూడా చేసుకున్నారు. అయినప్పటికీ వారు తరచూ మాట్లాడుకునేవారు. 
 
ఈ క్రమంలో బాలిక బంధువు చింటూకి వీరి ప్రేమ గురించి తెలియడంతో బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అలా శ్రీరాములు నుంచి రూ.1.35 లక్షలు వసూలు చేశాడు. అయినప్పటికీ మరింత కావాలని పట్టుబట్టడం, పెళ్లికి పెద్దలు అంగీకరించే ప్రసక్తే లేదని భావించి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
 
శ్రీరాములు సోమవారం సాయంత్రం ఓ సెల్ఫ్ డ్రైవ్ సంస్థ నుంచి కారు అద్దెకు తీసుకున్నాడు. బాలికతో కలిసి ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు వద్దకు చేరుకున్నాడు. రోడ్డు పక్కన కారు ఆపి వెంట తెచ్చుకున్న పెట్రోలును మీద పోసుకుని నిప్పంటించుకున్నారు. మంటలు భరించలేని శ్రీరాములు బయటకు వచ్చి కేకలు వేస్తూ కిందపడి మృతి చెందాడు. బాలిక మాత్రం శరీరం గుర్తించలేనంతగా కారులోనే కాలి బూడిదైంది. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికే కారు పూర్తిగా బుగ్గి అయింది. కాగా, ప్రేమ విషయాన్ని కుమారుడు కొన్ని రోజుల క్రితమే తమకు చెప్పాడని శ్రీరాములు తల్లిదండ్రులు తెలిపారు. ఘటనకు కొన్ని నిమిషాల ముందు సూసైడ్ లేఖ పంపాడని చూపిస్తూ బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేపాల్‌లో భారీ భూకంపం - భారత్ కూడా ప్రకంపనలు (Video)