ఆ వివాహిత ఏం తప్పు చేసిందో ఏమోగానీ... రెండు చేతులను రెండు గుంజలకు కట్టేసి... బెల్తుటో కొడుతూ, జుట్టుపట్టుకుని వెనక్కి విరిచి కాళ్ళతో తన్నుతూ చిత్ర హింసలకు గురిచేశాడో కిరాతక భర్త. ఏకంగా ఒక రోజు రాత్రంతా ఆమెకు నకరం చూపించాడు. ఈ క్రమంలో మళ్లీ ఉదయాన్ని దాడి చేసేందుకు ప్రయత్నించగా, ఆమె అతని బారి నుంచి తప్పించుకుని ఎలాగోలా బయటపడింది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాలెంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కలుజువ్వలపాడు గ్రామానికి చెందిన గురునాథం బాలాజీకి దగ్గర బంధువైన భాగ్యలక్ష్మితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు, మగ పిల్లాడు. మద్యానికి బానిసైన బాలాజీ భార్యను తీవ్రంగా హింసించేవాడు. ఈక్రమంలోనే భార్యపిల్లల్ని వదిలేసి వేరే మహిళతో హైదరాబాద్ నగరంలో ఉంటున్నాడు. భాగ్యలక్ష్మి స్థానిక బేకరీలో పనిచేస్తూ పిల్లలను చదివిస్తోంది.
ఈ క్రమంలో శనివారం గ్రామానికి వచ్చిన బాలాజీ భార్యను డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. అతని అక్క రమణమ్మ, మేనల్లుడు విష్ణు సహకరించారు. రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వర
కూ హింసించారు. మరలా సోమవారం రాత్రి ఆమెపై దాడికి ప్రయత్నించగా తప్పించుకొని సమీపంలోని చర్చి వద్దకు వెళ్లడంతో అక్కడ ఉన్న స్థానికులు బాలాజీ నుంచి కాపాడారు.
ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగళవారం రాత్రి పొదిలి సీఐ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకొని బాధితురాలిని మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. కాగా, గ్రామంలో దీనిపై విచారణ చేశామని, ఇంట్లో నిందితుడు లేడని, ప్రస్తుతానికి భాగ్యలక్ష్మి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి నిందితుడిపై చర్యలు తీసు కుంటామని ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలిపారు.