Publish Date: Thu, 13 Aug 2026 (09:30 IST)
Updated Date: Thu, 13 Aug 2026 (09:42 IST)
శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణం పేరుమీద వచ్చిన మాసం కావడంతో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అందుకే దీనిని శ్రావణ మాసం అని పిలుస్తారు. శ్రీకృష్ణ భగవానుడు పుట్టినది, హయగ్రీవోత్పత్తి జరిగింది, గరుడుడు అమృతభాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోనే.
గురుకులాల్లో విద్యార్థులు వేదపాఠం మొదలయ్యే ముందు చేపట్టే సంవిధానాన్ని శ్రావణి అని కూడా అంటారు. శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీమహాలక్ష్మీ దేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ, వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తియుక్తుల్ని అందిస్తుందని నమ్మకం. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది.
త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు.
శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
Read More