Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇల్లు కట్టగలమా? అసలు కొనగలమా? భారీగా పెరుగుతున్న నిర్మాణ వ్యయం

Advertiesment
3D printed home

ఐవీఆర్

, సోమవారం, 18 నవంబరు 2024 (20:11 IST)
- నిర్మాణ సామగ్రి, కార్మికుల భత్యాలలో పెరుగుదల.
- ఐదేళ్లలో కార్మికుల వేతనాల్లో 150 శాతం వృద్ధి.
- ఏటేటా 11 శాతం పెరుగుతున్న సామగ్రి ధరలు.
- భవనం చ.అ. ధరలు పెరుగుదల అనివార్యం.
 
దేశంలో నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల భత్యాలు, ఇంధన ధరల వృద్ధితో భవన నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నాయి. దీంతో నివాస, వాణిజ్య, పారిశ్రామిక భవన సముదాయాల నిర్మాణం భారంగా మారుతుంది. ఏడాది కాలంలో స్టీల్, సిమెంట్, అల్యూమీనియం, కాపర్‌ వంటి నిర్మాణ సామగ్రి ధరలు 11 శాతం, లేబర్‌ ఖర్చులు 25 శాతం మేర పెరిగాయని కొల్లియర్స్‌ ఇండియా తాజా అధ్యయనం వెల్లడించింది.
 
లేబర్‌ శిక్షణ, భద్రతతో కూడా వృద్ధి..
నివాస, వాణిజ్య, పారిశ్రామిక ఏ భవన నిర్మాణ ఖర్చులోనైనా సరే 67 శాతం నిర్మాణ సామగ్రి, 28 శాతం కార్మికులు, 5 శాతం ఇంధన వ్యయాలు ఉంటాయి. ఇసుక, ఇటుక, కలప, గ్లాస్‌ వంటి నిర్మాణ సామగ్రి ధరలు అందుబాటులోనే ఉన్నా.. నిర్మాణ కూలీల వేతనాల పెరుగుదల నిర్మాణ వ్యయంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం, శిక్షణ, భద్రత, నిర్వహణ సంబంధిత ఖర్చులతో నిర్మాణ వ్యయం మరింత పెరుగుతుంది.
 
సామగ్రి ధరల పెరుగుదల..
స్టీల్, సిమెంట్, కాపర్, అల్యూమీనియం వంటి ప్రధాన నిర్మాణ సామగ్రి ధరలతో పాటు కార్మికుల వ్యయం విపరీతంగా పెరిగిపోయాయి. అత్యధికంగా కార్మికుల భత్యాలు, కాపర్‌ ధరలు వృద్ధి చెందాయి. గత ఐదేళ్లలో కాపర్‌ ధర 91 శాతం, స్టీల్, అల్యూమీనియం 57 శాతం, సిమెంట్‌ 30 శాతం మేర ధరలు పెరగగా.. కార్మికుల వేతనాలు ఏకంగా 150 శాతం పెరిగాయి. ఏటా లేబర్‌ ఖర్చులు 25 శాతం కంటే ఎక్కువే వృద్ధి చెందుతున్నాయి.
 
ఎంత పెరిగాయంటే..
2020 అక్టోబర్‌లో 15 అంతస్తుల నివాస భవన నిర్మాణానికి చ.అ.కు రూ.2 వేలు వ్యయం కాగా.. 2024 అక్టోబర్‌ నాటికి రూ.2,780కు చేరింది. అలాగే గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ నిర్మాణ వ్యయం రూ.1,850 నుంచి రూ.2,850కు, అలాగే పారిశ్రామిక భవన నిర్మాణ ఖర్చు 1,875 నుంచి 2,380కు పెరిగాయి. ఏడాది కాలంలో నివాస విభాగంలో నిర్మాణ వ్యయం 11 శాతం, కమర్షియల్‌లో 6 శాతం, ఇండస్ట్రియల్‌లో 3 శాతం మేర పెరిగాయి.
 
కొనుగోలుదారుల జేబుకే చిల్లు..
నిర్మాణ వ్యయ భారాన్ని డెవలపర్లు మోయరు కొనుగోలుదారులకే బదలాయిస్తారు. ఏమేరకు ఖర్చు పెరిగిందో అంతమేర భవనం చ.అ. ధరలను పెంచి విక్రయిస్తారు. దీంతో కస్టమర్ల జేబుకే చిల్లు పడుతుంది. ఏటేటా నిర్మాణ వ్యయం పెరుగుతున్నప్పటికీ డెవలపర్లు నాణ్యత, ఆధునిక వసతుల కల్పనలో ఏమాత్రం రాజీపడటం లేదు. మరోవైపు కొనుగోలుదారుల్లోనూ నిర్మాణ నాణ్యత, సౌకర్యాల స్పృహ పెరగడంతో హైరైజ్‌ భవనాలు, గేటెడ్‌ కమ్యూనిటీలకు డిమాండ్‌ ఏర్పడింది. మరోవైపు ఈ ఏడాది వాణిజ్య, పారిశ్రామిక విభాగంలో సరఫరా పెరిగింది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 37 మిలియన్‌ చ.అ. ఆఫీస్‌ స్పేస్, 22 మిలియన్‌ చ.అ. ఇండస్ట్రియల్‌ స్పేస్‌ సప్లయి జరిగింది.
 
హైదరాబాద్ లోని ప్రముఖ బిల్డర్లు అభిప్రాయాలు
గత ఐదు సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగింది, మరి ముఖ్యంగా టాక్సెస్ సంబందించిన సందిగ్ధతలో జిఎస్టితో, రాయల్టీ పైన మరియు సెల్లార్ల పైన టాక్స్ పెరగడం జరిగినది దీని వలన కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగినది, రెండోది సాండ్, సిమెంట్, యూపీవీసీ విండోస్, టైల్స్ పైన కాస్ట్ పెరగడం వలన లేబర్ కాస్ట్ కూడా విపరీతంగా పెరగడం పెద్ద ఇంపాక్ట్ చూసాము, దీనివలన దాదాపు 35-40 % కాస్ట్ పెరగడం కన్పిస్తుంది అని సుచిర్ ఇండియా ఎండి లయన్ వై.కిరణ్ అన్నారు.
 
గత ఐదు సంవత్సరాలలో, నిర్మాణ ఖర్చులు గణనీయంగా పెరిగి, రియల్ ఎస్టేట్ రంగాన్ని కొత్త దిశల్లో మలిచాయి. ఈ కారణంగా, డెవలపర్లు ఖర్చులను తగ్గించడంలో నూతన పరిష్కారాలను అన్వేషిస్తూ, నాణ్యతపై రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారు. ప్రనీత్ గ్రూప్‌లో, మేము ప్రాప్యతను మరియు అత్యుత్తమతను సమతుల్యం చేస్తూ, వినియోగదారులకు అధిక ఖర్చుల మధ్య కూడా విలువైన ఇల్లు అందించడానికి కట్టుబడి ఉన్నాం అని నరేంద్ర కుమార్ కామరాజు, మేనేజింగ్ డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారం, పసుపు ఎక్కువగా తింటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?