Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

Advertiesment
joe biden

ఠాగూర్

, సోమవారం, 2 డిశెంబరు 2024 (15:55 IST)
అమెరికా అధ్యక్ష పీఠం నుంచి మరికొద్ది రోజుల్లో దిగిపోనున్న జో బైడెన్ తన కుమారుడుకి క్షమాభిక్ష పెట్టుకున్నారు. అక్రమంగా ఆయుధం కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసుల్లో కుమారుడు హంటర్‌కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడిపై కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని ఈసందర్భంగా జో బైడెన్ ఆరోపించారు.
 
'అమెరికా ప్రజలకు నిజాన్ని చెప్పాలి - నా జీవితం మొత్తంలో నేను పాటిస్తున్న సూత్రం ఇదే..! న్యాయశాఖ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోనని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే చెప్పా. ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా. నా కుమారుడు హంటర్‌ను అన్యాయంగా విచారించే సమయంలోనూ నేను చూస్తూ ఉండిపోయా. రాజకీయ కుట్రలో భాగంగానే అతడిపై కేసులు పెట్టారు. 
 
ఇక జరిగింది చాలు. ఈ కేసుల్లో అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించుకున్నా. ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా' అని ఆయన పేర్కొన్నారు. కాగా.. హంటర్ దోషిగా తేలిన సమయంలో క్షమాభిక్షకు యత్నించబోనని స్పష్టంగా పేర్కొన్న బైడెన్... తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
 
కాగా, జో బైడెన్ కుమారుడుపై ఉన్న కేసుల వివరాలను పరిశీలిస్తే, 2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలరుకు ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్ తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని, తనవద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు. అయితే అది తప్పని తేలింది. అప్పటికే హంటర్ డ్రగ్స్ అక్రమంగా కొనుగోలు చేశారు. వాటికి బానిసగా మారారు. 11 రోజులపాటు అక్రమంగా ఆయుధం కలిగివున్నారు. ఇక, కాలిఫోర్నియాలో 1.4 మిలియన్ డాలర్ల పన్ను ఎగవేత ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది.
 
అక్రమ ఆయుధం కొనుగోలు వ్యవహారంలో హంటర్‌పై నమోదైన కేసులో ఈ యేడాది జూన్‌లో న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. అయితే ఇప్పటివరకు శిక్ష ఖరారు చేయలేదు. దీనిపై అప్పట్లో జో బైడెన్ స్పందిస్తూ.. తీర్పును అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో తాను కుమారుడి తరపున క్షమాభిక్ష కోరబోనని అప్పట్లో వెల్లడించారు. ఇప్పుడు అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే సమయంలో కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని బైడెన్ వినియోగించుకోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)