కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు శిక్షను అనుభవిస్తుందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈడీని తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒరిస్సా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం ఈడీ పనితీరుపై స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఈడీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం అదే సంస్థ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. పైగా, ఆర్థిక సంబంధిత నేరాలను దర్యాప్తు చేయడానికి ఇతర ఏజెన్సీలు అనేకం ఉన్నాయని అందువల్ల ఈడీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నేషనర్ హెరాల్డ్ నిధులు దుర్వినియోగం కేసులో ఏ1గా సోనియా గాంధీ, ఏ2గా రాహుల్ గాంధీల పేర్లను ఈడీ చేర్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే అఖిలేష్ యాదవ్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్లు వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నాయంటూ యూపీలోని బీజేపీ, కేంద్రంలోని బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ఒరిస్సా ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించడం లేదని ఆయన అన్నారు.