తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువణ్ణామలై జిల్లాలతో సహా అనేక ప్రాంతాలలో రాత్రిపూట మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. శనివారం తెల్లవారుజామున నగరంలో తెగిపడిపోయిన విద్యుత్ తీగను అనుకోకుండా తొక్కేసిన ఒక పారిశుధ్య కార్మికురాలు విద్యుదాఘాతానికి గురై మరణించిందని పోలీసులు తెలిపారు. వరలక్ష్మిగా గుర్తించబడిన పారిశుధ్య కార్మికురాలు తెల్లవారుజామున కన్నగి నగర్ వద్ద శుభ్రపరిచే పనిలో ఉండగా వర్షపు నీటిలో నడిచింది. ఈ క్రమంలో తెగిపోయిన విద్యుత్ తీగను గమనించలేకపోయింది.
విద్యుదాఘాతం కారణంగా ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. ఆమె కుటుంబానికి వెంటనే రూ.20 లక్షల పరిహారం అందజేశారు. రాత్రిపూట కురిసిన వర్షానికి చెన్నైలోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. నుంగంబాక్కంలోని లయోలా కళాశాల సమీపంలో ఒక భారీ చెట్టు కూలిపోయింది. నగర ట్రాఫిక్ పోలీసు సిబ్బంది మరియు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కార్మికులు సంఘటనా స్థలానికి చేరుకుని చెట్ల కొమ్మలను తొలగించి ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
నగరంలోని సబ్‌వేలలో నిలిచి ఉన్న నీటిని తొలగించామని, నివాసితులు సురక్షితంగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువన్నామలై, విల్లుపురం, నాగపట్నం జిల్లాలలో ఒక మోస్తరు నుండి తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. చెన్నై, దాని శివారు ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో వరుసగా రెండవ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.