Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

Advertiesment
flight

ఠాగూర్

, శుక్రవారం, 9 మే 2025 (09:32 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకుంది. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంతో పాకిస్థాన్ సైతం ప్రతీకార దాడులకు దిగుతోంది. దీంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు విమానం బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలని ఎయిర్ ఇండియా సూచించింది. 
 
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని ఆదేశించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ వేదికగా వెల్లడించింది. చెక్-ఇన్, బోర్డింగ్ విమానం బయలుదేరడానికి 75 నిమిషాల ముందే ముగుస్తాయని కూడా స్పష్టం చేసింది.
 
పశ్చిమ సరిహద్దు వెంబడి జమ్మూతో పాటు పలు సైనిక స్థావరాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో వైమానిక దాడులకు యత్నించగా, భారత వాయు రక్షణ వ్యవస్థలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ దాడి యత్నం తర్వాత జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, ప్రజలను అప్రమత్తం చేశారు. పాకిస్థాన్ చర్యలకు భారత్ ప్రతీకార చర్యలు చేపట్టినట్లు సమాచారం.
 
ఈ ఉద్రిక్తతల కారణంగా, దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని శ్రీనగర్, జమ్మూ, లేహ్, చండీగఢ్, అమృత్సర్ సహా 27 విమానాశ్రయాలను మే 10 వరకు మూసివేశారు. దీంతో గురువారం ఒక్కరోజే సుమారు 430 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. బుధవారం కూడా 300కు పైగా విమానాలు రద్దు కాగా, 21 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. తాజా పరిస్థితుల దృష్ట్యా మరికొన్ని విమానాశ్రయాలను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు తెలిసింది.
 
ప్రస్తుతం తమ కాల్ సెంటర్లకు అధిక సంఖ్యలో కాల్స్ వస్తున్నాయని ఎయిర్ ఇండియా తెలిపింది. దేశ రక్షణలో నిస్వార్థ సేవలందిస్తున్న సైనిక, రక్షణ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు తాజా సమాచారం కోసం ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియాను అనుసరించాలని సూచించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ