Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్‌పై భారత్‌కు అతి గొప్ప దౌత్య విజయం.. దేశంలో సంబరాలు

చాలా కాలం తర్వాత భారతదేశం తన దాయాది పాకిస్తాన్‌పై అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద దౌత్య విజయం సాధించింది. కుల్‌భూషణ్‌ జాధవ్‌కు మరణశిక్ష కేసులో పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్‌ తీరు సరిగా లేదంటూ అంతర్జాతీయ న్యాయస్థానం మొట్టికాయ

Advertiesment
International Court of Justice
హైదరాబాద్ , శుక్రవారం, 19 మే 2017 (04:43 IST)
చాలా కాలం తర్వాత భారతదేశం తన దాయాది పాకిస్తాన్‌పై అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద దౌత్య విజయం సాధించింది. కుల్‌భూషణ్‌ జాధవ్‌కు మరణశిక్ష కేసులో పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్‌ తీరు సరిగా లేదంటూ అంతర్జాతీయ న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. అసలు జాధవ్‌ను అరెస్టు చేసిన పరిస్థితులే వివాదాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ కేసులో జాధవ్‌కు ఎలాంటి దౌత్యపరమైన సాయం అందకుండా పాకిస్తాన్‌ వ్యవహరించిందని.. ఇది హక్కుల ఉల్లంఘనేనని, వియన్నా ఒప్పందానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. 
 
జాధవ్‌కు దౌత్యపరమైన సాయం అందేందుకు వీలు కల్పించాలని.. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కోర్టుకు వివరాలు అందజేయాలని పాకిస్తాన్‌కు సూచించింది. ఈ కేసులో తుది తీర్పు వెలువరించేవరకు జాధవ్‌కు మరణశిక్షను అమలు చేయరాదని ఆదేశిస్తూ.. స్టే విధించింది. ఈ మేరకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) అధ్యక్షుడు రోనీ అబ్రహాం నేతృత్వంలోని 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. 
 
‘‘జాధవ్‌ మరణశిక్షపై అప్పీలును విచారించే అధికారం అంతర్జాతీయ న్యాయస్థానానికి లేదు’’...‘‘గూఢచర్యం కింద అరెస్టైన వ్యక్తికి తన దేశ రాయబార కార్యాలయ సిబ్బందిని సంప్రదించే హక్కు ఉండదు’’...అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పాకిస్తాన్‌ వాదనల్లోని రెండు ప్రధానాంశాలివి. ఈ రెండింటినీ ఐసీజే తోసిపుచ్చింది. 
 
‘వియన్నా ఒప్పందాన్ని అమలు చేసే క్రమంలో ఏదైనా వివాదం వస్తే, అది తప్పనిసరిగా ఐసీజే పరిధిలోకే వస్తుంది. ఇరుపార్టీల్లో ఎవరైనా ఐసీజేను ఆశ్రయించవచ్చు’ అనేది ఒప్పందంలోని ఓ నిబంధన. దీని మూలంగానే పాక్‌ మొదటి వాదన వీగిపోయింది.
 
అరెస్టయిన తమ దేశస్తుడిని జైలులో కలుసుకొనే, మాట్లాడే హక్కు దౌత్య సిబ్బందికి ఉంటుంది. అతనితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ న్యాయ సహాయాన్ని కూడా అందించవచ్చు. ఎవరైనా వ్యక్తి ఫలానా నేరాల కింద అరెస్టయితే... ఆ దేశ దౌత్య సిబ్బందికి పై హక్కులు ఉండవని ఎక్కడా పేర్కొనలేదు. అందుకే గూఢచర్యం కింద అరెస్టయితే దౌత్య సిబ్బందికి హక్కులుండవనే పాక్‌ రెండో వాదన వీగిపోయింది.
 
ఐసీజే తీర్పుపై ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంలో కీలకంగా వ్యవహరించి భారత్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది హరీశ్‌ సాల్వేను అభినందించారు. కుల్‌భూషణ్‌ జాధవ్‌ను కాపాడటంలో ప్రతి చిన్న అవకాశాన్నీ వినియోగించుకుంటామని సుష్మాస్వరాజ్‌ ట్వీటర్‌లో ట్వీట్‌ చేయగా.. మోదీ దానిని రీట్వీట్‌ చేశారు. ‘‘పాకిస్తాన్‌ తప్పు చేసినట్లు తేలిపోయింది. వియన్నా ఒప్పందం ప్రకారం వారు జాధవ్‌కు దౌత్య సాయం అందించాల్సిందే..’’అని మోదీ పేర్కొన్నారు. ఐసీజే తీర్పు గురించి తెలియగానే దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ డిమాండ్‌.. ఏపీ-తెలంగాణ నుంచే అందుబాటులో 13 లక్షల వస్తూత్పత్తులు