తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఒక దళిత మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ అధికార డిఎంకె మహిళా కౌన్సిలర్ కాళ్లపై పడినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. 56 సెకన్ల క్లిప్‌లో జూనియర్ అసిస్టెంట్ మునియప్పన్ అనే వ్యక్తి చర్చలో భాగంగా మహిళా కౌన్సిలర్ రమ్య పాదాలపై పడినట్లు కనబడుతోంది. ఈ వీడియోలో రమ్య మరికొందరు పక్కన కూర్చుని ఉండగా తన కాళ్లపై పడవద్దు అని చెబుతున్నప్పటికీ జూనియర్ అసిస్టెంట్ పాదాలపై పడినట్లు కనిపిస్తోంది. మరొక విషయం ఏమిటంటే... అతడు మహిళా కౌన్సిలర్ పాదాలపై పడే క్రమంలో ఆమె నడుముపై చేయి వేయడం అభ్యంతరకరంగా కనిపిస్తోంది.
మునియప్పన్ మంగళవారం తాను స్వచ్ఛందంగా కౌన్సిలర్ పాదాలపై పడ్డానని రాతపూర్వక ప్రకటన ఇచ్చారని పోలీసులు తెలిపారు. అయితే అంతలోనే తన తాజా ఫిర్యాదులో, డిఎంకె కౌన్సిలర్ తనను తన ముందు మోకరిల్లమని కోరారని, అందుకే ఆ పని చేయాల్సి వచ్చిందని తెలిపినట్లు సమాచారం. అతడి ఫిర్యాదు మేరకు తమిళనాడు పోలీసులు రమ్య, మరికొందరిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఐతే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.