Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరిహద్దుల్లో ప్రశాంతత - 19 రోజుల తర్వాత వినిపించని తుపాకుల శబ్దాలు!!

Advertiesment
line of control

ఠాగూర్

, సోమవారం, 12 మే 2025 (12:52 IST)
భారత, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతంలో గత 19 రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది. ఎల్వోసీ వద్ద ఆదివారం రాత్రి నుంచి తుపాకీ కాల్పుల మోత వినిపించడం లేదు. ఈ విషయాన్ని భారత సైన్యమే స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత  ఎల్వోసీ వద్ద అలజడి నెలకొనగా 19 రోజుల తర్వాత ఆదివారం రాత్రిత ప్రశాంతంగా గడిచిందని తెలిపింది. 
 
జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి సోమవారం రాత్రి ఎలాంటి కాల్పుల ఘటనలుగానీ, షెల్లింగ్‌‍గానీ జరగలేదని భారత సైన్యం స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిగ్గా 19 రోజుల అనంతరం సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొనడం గమనార్హం. ఇటీవల భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం ఇరు దేశాల మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 
 
అయితే, ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ దళాలు దాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడ్డాయి. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాకిస్థాన్ వెనక్కి తగ్గి ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా గత రాత్రి నుంచి నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు, ఇతర ప్రాంతాల్లోనూ శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని సైన్యం పేర్కొంది.
 
పహల్గాం ఉగ్రదాడి నుంచి పాకిస్థాన్ సైన్యం ప్రతిరోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్' తర్వాత పాక్ దళాలు పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని మోర్టార్ షెల్స్‌లో దాడులకు దిగడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో భద్రతా దళాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కొన్ని రోజులుగా వారంతా తాత్కాలిక శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు.
 
అయితే, సరిహద్దు గ్రామాల్లో పరిస్థితులు ఇప్పుడే పూర్తిగా చక్కబడలేదని, ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లడానికి తొందరపడొద్దని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరించింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా పేలని మోర్టార్ షెల్స్ ఉండే అవకాశం ఉందని, వాటిని గుర్తించి నిర్వీర్యం చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న ఇతర రాష్ట్రాల్లో కూడా గత రాత్రి డ్రోన్ల సంచారం, కాల్పులు, లేదా బాంబు దాడులు వంటి ఘటనలేవీ నమోదు కాలేదని సమాచారం. అయినప్పటికీ, భద్రతా దళాలు పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Andhra Pradesh: రక్షణ సిబ్బంది ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు