ఓ వ్యక్తి ఇద్దరు మహిళలను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరితో యేడాది పాటు గుట్టుచప్పుడు కాకుండా కాపురం చేశాడు. చివరకు ఈ విషయం పసిగట్టిన ఇద్దరు భార్యలు మోసగాడి భర్తకు తగిన గుణపాఠం నేర్పించారు. పోలీసులకు ఫిర్యాదు చేసి జైలుకు పంపించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
స్థానికంగా ఓ డెలివరీ కంపెనీలో పనిచేసే రామకృష్ణ దూబే అలియాస్ రాహుల్ అనే వ్యక్తి 2024 నవంబరులో తన ప్రియురాలు ఖుష్బూను ప్రేమ వివాహం చేసుకున్నాడు. సరిగ్గా నెల రోజులు తిరిగేలోపే, కుటుంబ సభ్యులు కుదిర్చిన శివంగి అనే మరో యువతిని పెళ్లాడాడు. డెలివరీ బాయ్ ఉద్యోగం కావడంతో ఎక్కువ సమయం బయటే ఉంటూ, ఇద్దరు భార్యలకు అనుమానం రాకుండా ఏడాది పాటు రెండు కాపురాలను నెట్టుకొచ్చాడు. ఈ క్రమంలో మొదటి భార్య ఖుష్బూకు ఒక ఆడబిడ్డ కూడా జన్మించింది.
అయితే, ఒకే ఒక్క ఫోన్ కాల్ అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఒకరోజు ఖుష్బూ తన భర్తకు ఫోన్ చేయగా, అనుకోకుండా రెండో భార్య శివంగి ఆ ఫోన్‌ను లిఫ్ట్ చేసింది. తాను రామకృష్ణ భార్యనని ఖుష్బూ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో ఖుష్బూ తన పెళ్లి ఫొటోలను శివంగికి పంపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ మోసం తెలియగానే ఇద్దరు భార్యలు ఒకటై స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తమను పెళ్లి పేరుతో రామకృష్ణ మోసం చేశాడని, అందుకు సంబంధించిన ఫొటోలు, ఆధారాలను పోలీసులకు సమర్పించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు బహు భార్యత్వం కింద కేసు నమోదు చేసి రామకృష్ణను అరెస్టు చేసి జైలుకు తరలించారు.