Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిషి పంచమి రోజున ఏం చేయాలంటే..? సప్త రుషులను..?

Advertiesment
Rishi Panchami
, మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (12:55 IST)
రిషి పంచమి సెప్టెంబర్ 3వ తేదీ 2019న దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగను వినాయక చవితికి మరుసటి రోజున జరుపుకుంటారు. ఈ రోజున సప్త రుషులను పూజించడం ద్వారా అనుకున్న కార్యాలను పొందవచ్చు. కశ్యప, ఆర్తి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ట మహర్షులను స్తుతించడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయి. 
 
ఈ పండుకను కేరళలో విశ్వకర్మ పూజగా చేస్తారు. రాజస్థాన్‌లో రిషి పంచమిగా, ఉత్తరాదిన రాఖీగా జరుపుకుంటారు. ఈ పూజను జరుపుకునే వారు.. సెప్టెంబర్ మూడో తేదీ మంగళవారం ఉదయం 11.24 గంటల నుంచి మధ్యాహ్నం 1.52లోపు చేయాల్సి వుంటుంది. 
 
అలాగే వ్రతాలన్నింటిలోనూ అత్యుత్తమైనది ఏదో చెప్పమని ధర్మరాజు కోరినప్పుడు, అందుకు సమాధానంగా శ్రీ కృష్ణుడు చెప్పినదే 'రుషి పంచమి' వ్రతం. స్త్రీ దోషాలకు పరిహారంగా జరుపుకునే ఈ వ్రతాన్ని 'భాద్రపద మాసం'లో 'శుక్ల పక్ష పంచమి' రోజున ఆచరించాలి. ఈ రోజున నదీ తీరానికి వెళ్లి దంతావధానం... పరిమళ ద్రవ్యాలతో మంత్ర పూర్వకంగా స్నానం చేయాలి. ఆ తరువాత ఆ నదీ జలాన్ని తీర్థంగా తీసుకుని, అక్కడ హోమం చేయాలి.
 
ఇంటికి చేరుకున్న తరువాత వ్రతానికి సంబంధించిన వేదికను పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. మట్టితో గాని రాగితో గాని కలశం పెట్టుకుని అందులో నీటిని పంచ రత్నాలను ఉంచాలి. అష్టదళ పద్మం వేశాక సంకల్పం చెప్పుకోవాలి.
 
గణపతిని పూజించి గంగా యమున కృష్ణ తుంగభద్ర తదితర నదుల నామాలను మహర్షుల నామాలను స్మరించుకోవాలి. సప్తరుషులను అరుంధతిని పూజించాలి. ఆ తరువాత కథ చెప్పుకుని వాయనదానాలు ఇవ్వాలి. ఇలా ఏడు సంవత్సరాల పాటు క్రమం తప్పక ఈ వ్రతాన్ని చేసుకుని ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవాలి. 
Rishi Panchami
 
ఇక ఈ వ్రతం జరుపుకోవడానికి కారణంగా చెప్పబడుతోన్న కథ గురించి తెలుసుకుందాం. పూర్వం విదర్భ దేశంలో సుమిత్రుడు - జయశ్రీ అనే దంపతులు నివసించేవారు. వేదశాస్త్ర పండితుడైన సుమిత్రుడు భార్యా విధేయుడు... అందువలన ఆమె రుతు దోషాలను పట్టించుకోకుండా నడచుకుంటున్నా చూస్తూ ఊరుకునే వాడు. 'సుమతి' అనే కుమారుడు జన్మించిన కొంత కాలానికి వాళ్లు కాలం చేశారు.
 
సుమతికి చంద్రావతితో వివాహం జరిగింది. నియమ నిష్టలను పాటిస్తూ వాళ్లు అన్యోన్యంగా కాలం గడపసాగారు. అలాంటి పరిస్థితుల్లో రుతుదోషానికి పాల్పడిన కారణంగా కుక్కగా జయశ్రీ, ఆ విషయంలో అడ్డు చెప్పనందుకు ఆమె భర్త సుమిత్రుడు ఎద్దుగా జన్మించారు. కొడుకు పట్ల తీరని ప్రేమానురాగాల కారణంగా వాళ్లు సుమతి ఇంటికి చేరుకున్నారు.
 
ఒక రోజున సుమతి తన ఇంట్లో పితృ కార్యాన్ని నిర్వహిస్తూ వుండగా, ఒక పాము వచ్చి పాయసం తాగేసి అదే పాత్రలో విషంకక్కి వెళ్లిపోయింది. కుక్క రూపంలో ఉన్న జయశ్రీ ఈ దృశ్యం చూసి, మిగిలిన పాయసాన్ని బ్రాహ్మణులకు వడ్డిస్తే ప్రమాదమని భావించి, చంద్రావతి చూస్తుండగా వాటిని తాకింది.
 
ఆవేశంతో ఆమె కర్రతో ఆ కుక్కను కొట్టి మళ్లీ పాయసాన్ని సిద్ధం చేసింది. ఇక సుమతి ఒకవైపున పితృ కార్యాన్ని శ్రద్ధగా నిర్వహిస్తూనే, మరో వైపున బాగా పొద్దుపోయేదాకా ఎద్దుతో పొలం పనులు చేయించాడు.
 
ఆ రాత్రి ఎద్దు... కుక్క రెండూ కూడా తమకి ఎదురైన అనుభవాన్ని గురించి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాయి. నియమ నిష్టల కారణంగా తనకి సంక్రమించిన కొద్దిపాటి శక్తితో, ఆ ఎద్దు... కుక్కల ఆవేదనను సుమతి అర్ధం చేసుకున్నాడు.
 
తపోబల సంపన్నులను కలుసుకుని విషయాన్ని వివరించాడు. పూర్వ జన్మ పాప ఫలితంగానే తల్లిదండ్రులు అలా జన్మించి అవస్తలు పడుతున్నారనీ, పాప విముక్తి కోసం 'రుషి పంచమి' వ్రతం చేయాలని తెలుసుకున్నాడు. 
Rishi Panchami
 
సుమతి ఈ వ్రతం ఆచరించగానే కుక్క - ఎద్దు రూపాలలో ఉన్న ఆయన తల్లిదండ్రులు తమ దేహాలను వదలి పుణ్యలోకాలకు తరలిపోయారు. ఆనాటి నుంచి ఈ వ్రతాన్ని ఎందరో ఆచరించి తగిన ఫలితాలను పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-09-2019- మంగళవారం దినఫలాలు - కొన్ని కారణాల రీత్యా మీ...