సంకటహర చతుర్థిని సంకష్ట చతుర్థి అని కూడా పిలుస్తారు. ఇది అడ్డంకులను తొలగించే రోజు. ఈ రోజున వినాయకుడిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. కృష్ణ పక్షం నాల్గవ రోజున సంకష్టహర చతుర్థిని జరుపుకుంటారు.
గణేశుడి అనుగ్రహం కోసం ఉపవాసం, ప్రార్థనలు చేస్తారు. సంకటహర అనే పదం సంస్కృత పదాలైన 'సంకట' అంటే ఇబ్బందులు లేదా అడ్డంకులు హర అంటే తొలగింపు నుండి వచ్చింది. అందువల్ల, సంకటహర చతుర్థి అనేది జీవితంలోని సవాళ్లను తొలగించడానికి గణేశుడికి అంకితం చేయబడిన రోజు.
ఈ పవిత్ర దినం ప్రతి నెలా, కృష్ణ పక్షంలోని నాల్గవ రోజున వస్తుంది. భక్తులు సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు. చంద్రుడిని చూసి గణేష్ పూజ చేసిన తర్వాత వారు ఉపవాసం ముగిస్తారు.
సంకటహర చతుర్థి బుధవారం వచ్చినప్పుడు.. వినాయకుడికి ఆలయంలో జరిగే అభిషేకాలను కనులారా వీక్షించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. నవగ్రహ దోషాలు, ఇతరత్రా సమస్త దోషాలను సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని పూజించడం ద్వారా తొలగిపోతుంది.