Publish Date: Mon, 29 Jun 2026 (10:30 IST)
Updated Date: Mon, 29 Jun 2026 (10:46 IST)
శుక్రవారం మధ్యాహ్నం నుండి వారాంతపు సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా, భక్తుల క్యూ లైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. సర్వదర్శనానికి సుమారు 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తోంది.
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పుడూ లేనంతగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సాధారణ భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. అలాగే ప్రతిరోజూ ఆన్లైన్లో జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.
టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. శనివారం మాత్రం పరిస్థితి మరింత భిన్నంగా ఉందన్నారు. తిరుమల చరిత్రలోనే అరుదుగా కనిపించేలా లక్షన్నర మందికి పైగా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారని చెప్పారు. దాదాపు 30 గంటలు దర్శనానికి టైమ్ పడుతుంట.
భారీ రద్దీ ఉన్నప్పటికీ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆదివారం కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు. అధికారులు, ఉద్యోగుల సెలవులు పూర్తిగా రద్దు చేశామని, అందరినీ విధుల్లో కొనసాగిస్తున్నామని తెలిపారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
Read More