Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

Advertiesment
k kavitha

ఠాగూర్

, శుక్రవారం, 22 నవంబరు 2024 (14:20 IST)
ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? అంటూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అఖండ భారతంలో వేర్వేరు న్యాయాలు ఏమిటని ఆమె అభిప్రాయపడ్డారు. అదానీపై అమెరికాలో లంచం ఇవ్వజూపినట్లుగా కేసు నమోదు కావడంతో ఆమె స్పందించారు.
 
ఆధారాలు లేకపోయినప్పటికీ ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ అన్నారు. కానీ ఆధారాలు ఉన్నప్పటికీ అదానీని అరెస్టు చేయడం మాత్రం కష్టమా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని నరేంద్ర మోడీ.. అదానీని రక్షిస్తూ ఆయన వైపే ఉంటారా అని నిలదీశారు. 
 
అఖండ భారతంలో సెలెక్టివ్ న్యాయం అందిస్తున్నారని, రాజకీయ ప్రత్యర్థులను సాక్ష్యాలు లేకుండానే అరెస్టు చేసి నెలల తరబడి జైల్లో ఉంచుతున్నారని, కానీ అదానీపై పదేపదే ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని ఇంగ్లీష్‌లోనూ ఆమె ట్వీట్ చేశారు. అదానీపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఆపుతోంది ఎవరు? అని ప్రశ్నించారు.
 
కవిత చాలా రోజుల తర్వాత ఎక్స్ వేదికగా స్పందించారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఆమె ఆగస్టు 29న సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత తన తండ్రి కేసీఆర్‌ను కలిసిన ఫొటోను ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కవిత కొన్ని నెలలు తీహార్ జైలు జీవితం గడిపిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, అదానీ గ్రూప్ పై అమెరికాలో లంచం ఆరోపణలతో కేసు నమోదు కావడం తెలిసిందే. దీనిపై భారత్ లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ నుంచి ప్రకటన వెలువడింది. 
 
అమెరికా న్యాయ విభాగం ఆరోపణలు నిరాధారమని, అందులో నిజం లేదని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, నిజాలు నిరూపితమయ్యే వరకు దోషులు కాదన్న విషయం అమెరికా న్యాయ విభాగం ప్రకటనలోనే ఉందని పేర్కొంది. 
 
తమ సంస్థ లావాదేవీల విషయమై పూర్తి పారదర్శకతతో నియంత్రణ సంస్థల నిబంధనలను పాటిస్తున్నామని వెల్లడించింది. చట్టాలపై గౌరవం ఉందని, చట్ట ప్రకారమే నడుచుకుంటామని భాగస్వాములు, వాటాదారులు, ఉద్యోగులకు చెప్పామని... ఆ మేరకే తాము నడుచుకుంటున్నామని అదానీ గ్రూప్ వివరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?