భారత రాష్ట్ర సమితి (భారాస) అధినేత కేసీఆర్‌కు ఆ పార్టీకి చెందిన రెబెల్స్ ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. తమపై అనర్హత వేటు వేయాలని భావించినందుకు సరైన సమాధానం ఇచ్చారు. ఫిరాయింపు నోటీసులు అందుకున్న ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి వివరణ ఇచ్చినట్టు సమాచారం. తామంతా భారాసాలోనే కొనసాగుతున్నామని స్పష్టం చేసినట్టు సమాచారం.
కాగా, భారాస తరపున ఎన్నికల్లో గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలంటూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో సభాపతి వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు.
దీంతో స్పీకర్ కార్యాలయం నుంచి తాఖీదులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(గద్వాల), అరెకపూడి గాంధీ(శేరిలింగంపల్లి), సంజయ్(జగిత్యాల), గూడెం మహిపాల్ రెడ్డి(పటాన్చెరు), పోచారం శ్రీనివాస్ రెడ్డి(బాన్సువాడ) ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కాలె యాదయ్య(చేవెళ్ల), తెల్లం వెంకట్రావు (భద్రాచలం) ఇటీవలే శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు.
కానీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్) మాత్రం సమాధానాలివ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకరు కోరినట్లు సమాచారం. తమపై చేసిన ఆరోపణలపై 8 మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణలో.. పలు లీగల్ జడ్జిమెంట్లను కూడా ఉదహరించినట్లు తెలిసింది.
ప్రధానంగా వీరిచ్చిన సమాధానాల్లో.. 'నేను పార్టీ మారలేదు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నా. నేనెక్కడా భారత రాష్ట్ర సమితికు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశా. ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారు. సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతున్నప్పుడు.. తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో కప్పుకొన్నాను. పైగా అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు' అని దాదాపు ఇదే తీరున 8 మంది ఎమ్మెల్యేలు వేర్వేరుగా వివరణ ఇచ్చినట్లు సమాచారం.