Publish Date: Thu, 24 Sep 2026 (09:57 IST)
Updated Date: Thu, 24 Sep 2026 (10:00 IST)
హైదరాబాద నగర శివారు ప్రాంతంలో ఉన్న చంచల్‌గూడ జైలు ఇపుడు కోటీశ్వరుల జైలుగా మారిపోయింది. వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టి, అవినీతికి పాల్పడి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతున్న బడా అధికారులు ఇప్పుడు ఈ జైలుకే చేరుతున్నారు. దీంతో ఒకప్పుడు సాధారణ ఖైదీలతో ఉండే ఈ జైలు, ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తులున్న వారితో నిండిపోతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తాజాగా, నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ ఆదాయానికి మించి రూ.100 కోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై అరెస్టు అయి చంచల్‌గూడ జైలుకు చేరారు. కొన్ని రోజుల క్రితమే డీఎస్పీ భీంరెడ్డి కూడా వంద కోట్లకు పైగా అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కి ఇక్కడికే వచ్చారు. వీరేకాకుండా, ల్యాండ్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరిరావు సైతం రూ.100 కోట్లకు పైగా ఆస్తుల కేసులో అరెస్టయి రిమాండ్ ఉన్నారు.
ఇలా పోలీసు, రెవెన్యూ, వైద్య, ఇంజనీరింగ్ వంటి పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఏసీబీ వలలో చిక్కి చంచల్‌గూడ జైలుకు చేరుతున్నారు. అవినీతి కేసుల్లో ప్రధానంగా రెండు రకాలుగా అధికారులు పట్టుబడుతున్నారు. ఒకటి, చేయాల్సిన పనికి నేరుగా లంచం డిమాండ్ చేయడం. రెండోది, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడం. ఈ రెండు కేసుల్లోనూ పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో, వారందరికీ చంచల్‌గూడ జైలు తాత్కాలిక నివాసంగా మారుతోంది.
ఓ విచిత్రమైన ఘటనలో, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్-జైలులో డిప్యూటీ జైలర్‌గా పనిచేసిన దేవేందర్, ఓ ఖైదీ నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గంటల వ్యవధిలోనే.. అధికారిగా పనిచేసిన అదే జైలులో ఆయన ఖైదీగా మారాల్సి వచ్చింది. ఒకప్పుడు అధికారం, విలాసవంతమైన జీవితం గడిపిన ఈ అధికారులు.. ఇప్పుడు జైలు గోడల మధ్య విచారణ ఖైదీలుగా కాలం గడుపుతున్నారు.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.....
Read More