Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

Advertiesment
Jagadeka Veerudu Athiloka Sundari poster

దేవీ

, సోమవారం, 5 మే 2025 (07:46 IST)
Jagadeka Veerudu Athiloka Sundari poster
తెలుగు చిత్ర పరిశ్రమలో, మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే ఓ క్లాసిక్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ క్లాసిక్ చిత్రాన్ని మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో-ఫాంటసీ చిత్రం విడుదలై 35వ సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు.
 
మే 9, 1990న జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదలైంది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ కూడా ఈ చిత్రం చెరిపేపింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ అనేలా ఈ మూవీ నిలిచిపోయింది. ఈ చిత్రం విడుదలైనప్పుడు దాని క్రేజ్‌ గురించి ఒక్క మాటలో ఓ ఉదాహరణగా చెప్పాలంటే.. రూ. 6 ధర ఉన్న టిక్కెట్ మొదటి మ్యాట్నీ షోకే బ్లాక్ మార్కెట్‌లో రూ. 210 వరకు అమ్ముడయ్యాయి. అంటే దగ్గరదగ్గరగా 35 రెట్లు అన్నమాట.
 
జగదేక వీరుడు అతిలోక సుందరిలో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్‌గా, లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిర్మాత సి. అశ్విని దత్ తన ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మించిన సంగతి తెలిసిందే.
 
‘అబ్బ నీ తీయని దెబ్బ’ అనే ఐకానిక్ పాట గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. ‘ఈ పాటను ఒక రోజులోపు కంపోజ్ చేశామని తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. ఇళయరాజా గారు ఉదయం 9 గంటలకు ఆ పాటపై పని చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 లేదా 12:30 గంటల ప్రాంతంలో మాకు ఒక ట్యూన్ ఇచ్చారు. అది రాఘవేంద్రరావు గారు, దత్ గారు, నాకు వెంటనే నచ్చింది. ఆ ట్యూన్ ఎంతో సరళంగా, తియ్యగా అనిపించింది. భోజన సమయంలో వేటూరి గారు సాహిత్యం రాశారు. బాలు గారు దానిని సరదాగా పాడారు’అని అన్నారు.
 
‘అందాలలో’ అనే పాట గురించి దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. ‘కథ ప్రకారం హీరో ఒక సామాన్యుడు, హీరోయిన్ ఒక దేవత అని చెప్పాల్సి వచ్చింది. దానిని పాట ద్వారా మాత్రమే సమర్థవంతంగా తెలియజేయగలమని మేము భావించాము. ఆ ఐకానిక్ పాటను కంపోజ్ చేయడం వెనుక ఉన్న ఆలోచన అదే’ అని అన్నారు.
 
‘దినక్కుతా’ అనే పాట గురించి అశ్వనీదత్ మాట్లాడుతూ .. ‘ఈ పాటను షూట్ చేసే టైంకి చిరంజీవి గారు 106 డిగ్రీల జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. ప్రతి షాట్ బ్రేక్ సమయంలో, మేము అతని శరీరాన్ని ఐస్ ప్యాక్డ్ బట్టలతో చుట్టి చల్లపరుస్తూ వచ్చాం. శ్రీదేవి గారి కాల్ షీట్లు మాకు చివరి రెండు రోజులు మాత్రమే ఉన్నందున ఆయన ఆ పాట కోసం చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత, ఆమె మరో షూటింగ్ కోసం ఒకటిన్నర నెలలు విదేశాలకు వెళుతోంది. కాబట్టి మేము ఆ రెండు రోజుల్లోనే ఒకే సెట్‌లో షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది. షూటింగ్ తర్వాత చిరంజీవి గారిని వెంటనే విజయ ఆసుపత్రిలో చేర్పించాం. 15 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు’ అని అన్నారు.
 
శ్రీదేవి గతంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ గురించి మాట్లాడుతూ..  ఈ చిత్రంలో తనకు ఇష్టమైన పాట ‘ప్రియతమ’ అని అన్నారు. అది చాలా అందమైన మెలోడీ. రాఘవేంద్రరావు గారు దానిని ఎక్కువ మూమెంట్స్ లేకుండా కేవలం కంటి చూపులు, సైగలతోనే కంపోజ్ చేయించారు. అది మరపురాని పాట అని ఆమె అన్నారు.
 
ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్లు అజయన్ విన్సెంట్, కె.ఎస్. ప్రకాష్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ‘మాస్ట్రో’ ఇళయరాజా అయితే ఎవర్ గ్రీన్ సంగీతాన్ని, పాటల్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఈ మూవీకి కథను యండమూరి వీరేంద్రనాథ్.. స్క్రీన్‌ప్లేను జంధ్యాల అందించారు. ఈ వేసవిలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాజాలాన్ని మే 9 నుంచి 2D, 3D ఫార్మాట్లలో చూసి ఎంజాయ్ చేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్