తన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవిపై హీరో పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఓ ఫైటర్ అని, ఆయనకు రిటైర్మెంట్ లేదంటూ కితాబిచ్చారు. తెలుగు ప్రేక్షకులకు చిరంజీవిని హీరోగా పరిచయం చేసిన చిత్రం ప్రాణం ఖరీదు. ఈ చిత్రం విడుదలై నేటికి 47 యేళ్లు పూర్తయింది. తన సుధీర్ఘ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి సోమవారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. దీనిపై పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా తన అన్నయ్యపై తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకుని, అలనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు.
''ప్రాణం ఖరీదు'లో అన్నయ్య హీరోగా నటించిన రోజులు నాకు బాగా గుర్తున్నాయి. అప్పుడు మేం నెల్లూరులో ఉండేవాళ్లం. అప్పటికి నేను స్టూడెంట్‌ని. సినిమా చూసేందుకు కనకమహల్ థియేటర్‌కు వెళ్లినప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. 47 ఏళ్ల ప్రయాణంలో ప్రతి విషయంలోనూ అన్నయ్య ఎంతో ఎదిగాడు. ఇప్పటికీ అదే వినయం. ఇతరులకు అండగా నిలవడం, సహాయం చేయడంలో ఎలాంటి మార్పూ రాలేదు.
ఆయన ఇలాగే ఎప్పుడూ విజయాలు అందుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నా. భవిష్యత్తులో ఆయన్ను మరిన్ని విభిన్న పాత్రల్లో చూడాలని కోరుకుంటున్నా. అన్నయ్య అనుకుంటే తప్ప ఆయనకు రిటైర్మెంట్ అనేదే లేదు' అని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో చిరంజీవితో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేశారు. చిరంజీవి నటించిన తొలి సినిమా 'పునాది రాళ్లు' అయినప్పటికీ.. విడుదలైన చిత్రం మాత్రం 'ప్రాణం ఖరీదు'.