21 Years before Arya team
అల్లు అర్జున్ హీరోగా, అనూ మెహతా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఆర్య. ఈ మూవీ ద్వారా సుకుమార్ దర్శకునిగా పరిచయమయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై నేటికి 21 ఏళ్లు అయ్యాయి. అల్లు అర్జున్ లైఫ్ ఛేంజింగ్ మూవీగా ఆర్య నిలిచింది. 2004 మే 7, న ఆర్య మార్నింగ్ షో పడింది,
ఇదేదో ఫీల్ మై లవ్ అంటున్నారు ఏంట్రా కొత్తగా? హీరో క్యారెక్టర్ ఇలా ఉంది ఏంటి? అంటూ డివైడ్ టాక్. వన్‌సైడ్ లవ్ కాన్సెప్ట్ కొత్త కావడంతో ప్రేక్షకులు వన్‌సైడ్ రిజల్ట్ ఇవ్వలేకపోయారు. అయితే ఇదంతా మొదటి రెండు రోజుల సంగతే. ఆ తరువాత కట్‌చేస్తే 125 రోజులు ప్రదర్శితమై, టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసింది.
2003 నవంబర్ 19న సినిమా లాంఛనంగా ప్రారంభమైన ఆర్యను 120 రోజుల్లో పూర్తి చేశారు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ ఫీల్ మై లవ్ అంటూ ప్రతి ప్రేమికుడు ఆ ప్రేమను ఫీలయ్యేలా చేయడమే కాదు, తకదిమితోం అంటూ చిందులు తొక్కించారు. అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం అంటూ అక్షరమాలకు కొత్త అర్థం చెప్పినా దేవికే చెల్లింది. ఇక అలా రూ.4 కోట్లతో నిర్మించి రిలీజ్ చేస్తే డివైడ్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ అయ్యి, ఫుల్ రన్లో రూ.30 కోట్లు వసూలు చేసింది. ఇక మలయాళంలో డబ్ చేసి విడుదల చేస్తే.. రూ.35 లక్షల వరకూ వసూలు చేసి అల్లు అర్జున్‌కు మల్లు అర్జున్ అనే పేరు కూడా సంపాదించి పెట్టింది.
నిజానికి అల్లు అర్జున్ గంగోత్రి ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. అయితే తన తొలి సినిమాకు, రెండో సినిమాకు గుర్తు పట్టలేనంతగా అతడు మారిపోయాడు. అతనిలోని స్టైలిష్ స్టార్ ను పరిచయం చేసిన సినిమా ఈ ఆర్య. గంగోత్రిలో అమాయకుడైన ఓ అబ్బాయి పాత్రలో కనిపించిన బన్నీ.. ఆర్యలో మాత్రం డిఫరెంట్ లుక్ లో కనిపించడంతోపాటు తనలోని అసలైన యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్ ను బయటపెట్టాడు. యూత్ లో స్టార్ గా మారిపోవడానికి కారణం ఈ ఆర్య సినిమానే. ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరియరే మారిపోయింది. తనలోని డ్యాన్స్,నటన, స్టైల్ ఇలా అన్నీ తెరపై చూపించాడు. దీంతో ఒక్కసారిగా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు.