Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరో శ్రీకాంత్ "పెళ్లిసందడి"కి పాతికేళ్ళు

Advertiesment
Pelli Sandadi
, మంగళవారం, 12 జనవరి 2021 (09:55 IST)
టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన దృశ్యకావ్యం "పెళ్లిసందడి". శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం జనవరి 12వ తేదీతో పాతికేళ్లు పూర్తిచేసుకుంది. 1996 జనవరి 12న విడుదలైన 'పెళ్ళి సందడి' ఆ నాటి సంక్రాంతి సంబరాల్లో భలేగా సందడి చేసింది. ఈ చిత్రంతోనే హీరో శ్రీకాంత్‌ సినీ జీవితం మారిపోయింది. 
 
ఇక రవళికి నాయికగా మంచి పేరు దక్కింది. ఈ సినిమా తర్వాత వివాహ వాహనాలపై ఫలానా వారి ఇంట 'పెళ్ళిసందడి' అంటూ రాసుకొనేవారు. దీనిని బట్టే 'పెళ్ళి సందడి' చిత్రం ఎంతలా జనాన్ని ఆకట్టుకుందో ఊహించవచ్చు. 
 
'పెళ్ళిసందడి' చిత్రానికి ముందు టాప్ హీరోస్ బాలకృష్ణ 'వంశానికొక్కడు', నాగార్జున 'వజ్రం' విడుదలయ్యాయి. తర్వాత వెంకటేశ్ 'ధర్మచక్రం' వచ్చింది. ఆరంభంలో టాప్ స్టార్స్ సినిమాలకే జనం పరుగులు తీశారు. పండగ నుంచీ 'పెళ్ళి సందడి' ఊపందుకుంది. 
 
ఆ ఊపు దాదాపు పదినెలల పాటు సాగింది. ఆ తర్వాత ఎన్ని చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దూకినా, చిన్న చిత్రంగా వచ్చి, అతి పెద్ద విజయం 'పెళ్ళిసందడి' కొట్టేసింది. మరో విచిత్రమేమంటే ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించడం. 
 
ఈ చిత్రంలో హీరోయిన్‌గా రవళితో పాటు.. దీప్తి భట్నాగర్ కూడా నటించింది. ఇతర పాత్రల్లో సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, శివాజీరాజా, బాబూమోహన్, ఏవీయస్, రాజా రవీంద్ర, శ్రీలక్ష్మి, చిట్టిబాబు, సుత్తివేలు, జెన్నీ, అనంత్, గుండు హనుమంతరావు, విశ్వేశ్వరరావు, రజిత నటించారు.
 
ఈ చిత్రానికి సత్యానంద్ రచన చేయగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు. వేటూరి, సిరివెన్నెల, జొన్నవిత్తుల, చంద్రబోస్, సామవేదం షణ్ముఖ శర్మ, కీరవాణి పాటలు రాశారు. ఇందులోని తొమ్మిది పాటలూ జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. 
 
ఇక పెళ్ళిళ్ళకు పిలవకుండానే వచ్చి, "కాఫీలు తాగారా? టిఫినీలు తిన్నారా?"అంటూ ఆప్యాయంగా పలకరించేవారి మాటలు కూడా ప్రేక్షకులను రంజింప చేశాయి. పెళ్ళిళ్ళలో ఈ మాటలు ఈ నాటికీ వినిపిస్తూ ఉండడం విశేషం. 
 
ఈ సినిమా ద్వారా కె.రాఘవేంద్రరావుకు ఉత్తమ దర్శకునిగా, ఉత్తమ నృత్య దర్శకునిగా రెండు నంది అవార్డులు లభించాయి. కీరవాణికి ఉత్తమ సంగీత దర్శకునిగా నంది అవార్డుతో పాటు ఫిలిమ్ ఫేర్ అవార్డూ దక్కింది. 
 
చిన్న సినిమాగా వచ్చిన 'పెళ్ళిసందడి' అతి పెద్ద విజయం సాధించి, అంతకు ముందుఉన్న  పలు రికార్డులను బద్దలు చేసింది. ఈ చిత్రం 30 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. 27 కేంద్రాలలో డైరెక్టుగా రెగ్యులర్ షోస్ తో రజతోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా నిలచింది. 12 కేంద్రాలలో 200 రోజులు ప్రదర్శితమయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతి నుంచి సంక్రాంతికి అలవైకుంఠపురములో, బుట్టబొమ్మ పూజా హెగ్డె