స్టాక్ హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా నటించిన చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో చిత్ర బృందం విజయోత్సవ వేడుకలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండు అతిథిగా హాజరుకానున్నట్టు ప్రచారం సాగుతోంది.
కాగా, రష్మిక మందన్నాతో విజయ్ దేవరకొండ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహం త్వరలోనే జరుగనుంది. ఈ నేపథ్యంలో 'ది గర్ల్ ఫ్రెండ్' సక్సెస్ మీట్ హైదరాబాద్ నగరంలోని ఓ నక్షత్ర హోటల్లో జరుగనుంది. దీనికి ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ హాజరుకానున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది.
పైగా, ఈ వార్త బయటకు రావడంతో విజయ్ - రష్మిక అభిమానుల్లో సరికొత్త చర్చ మొదలైంది. ఈ వేదికపైనే వారిద్దరూ తమ పెళ్ళి తేదీని ప్రకటించి అందరికీ శుభవార్త చెప్పబోతున్నారంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా? లేక ఇందులో నిజం ఉందా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.