హీరో విశాల్ ఆరోగ్యంపై ఆదివారం రాత్రి నుంచి పలు రకాలైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆయన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రతినిధులు సోమవారం క్లారిటీ ఇచ్చింది. "విశాల్ ఆరోగ్యం గురించి తాజాగా వచ్చిన వార్తలపై మేము స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాం. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాల్ కొద్దిసేపు అలసటతో స్పృహ కోల్పోయారు. ఆ రోజు మధ్యాహ్నం ఆయన భోజనం చేయలేదు. కేవలం జ్యూస్ మాత్రమే తాగారు. దానివల్ల ఆయన అలసటతో స్పృహ కోల్పోయి పడిపోయారు.
వెంటనే ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడు వైద్యులు పరీక్షించారు. అదృష్టవశాత్తూ ఆందోళన చెందడానికి ఎటువంటి అనారోగ్య కారణం లేదన్నారు. విశాల్ ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యులు చెప్పారు. అయితే, భవిష్యత్‌లో క్రమం తప్పకుండా భోజనం చేయాలని సూచించారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. విశ్రాంతి తీసుకుని కోలుకుంటున్నారు. విశాల్‌కు నిరంతరం మద్దతు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.