Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'వినరా సోదరా వీర కుమారా' నేటి యువత ట్రెండ్‌కి అద్దం.. రివ్యూ

Advertiesment
Vinara sodara veera kumara movie review
, గురువారం, 21 మార్చి 2019 (12:17 IST)
నటీనటులు: శ్రీనివాస్‌సాయి, ప్రియాంకజైన్‌, ఉత్తేజ్‌, ఝాన్సీ, జెమిని సురేష్‌, రవిరాజ్‌, పవన్‌రమేష్‌, సన్ని, రోషన్‌, జైబోలో చంటి తదితరులు.
 
సాంకేతికత: సంభాషణలు: లక్ష్మీభూపాల, సంగీతం: శ్రవణ్‌భరద్వాజ్‌, కెమెరా: రవి.వి, డాన్స్‌: అజయ్‌సాయి, స్టంట్స్‌: రాబిన్‌సుబ్బు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అనిల్‌ మైలాపుర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌ : కిరణ్‌, నిర్మాత: లక్ష్మణ్‌క్యాదారి, దర్శకత్వం: సతీష్‌ చంద్ర నాదెళ్ళ.
 
కొత్తగా సినిమా రంగంలో రాణించడానికి నటీనటులు సాంకేతిక సిబ్బంది పలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్టిస్టుగా 'ఊపిరి', 'గోల్కొండ హైస్కూల్‌' వంటి చిత్రాల్లో నటించిన శ్రీనివాస్‌ సాయిని కథానాయకుడిగా చేస్తూ టీనేజ్‌ లవ్‌స్టోరీ కథతో సతీష్‌చంద్ర దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఎప్పుడో రాసుకున్న కథను కార్యరూపం దాల్చి ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా మార్పులు చేస్తూ తీసిన ''వినరా సోదరా వీరకుమార' ఈనెల 22న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రంపై వున్న నమ్మకంతో ముందుగానే ప్రముఖులకు ప్రదర్శించారు. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ:
పెద్దగా చదువు అబ్బని రమణ (సాయి శ్రీనివాస్‌) ఓ గ్రామంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. జాలరిపనిచేసే ఉత్తేజ్‌, ఝాన్సీ అతని తల్లిదండ్రులు. ఆ ఊరి ఆసామికి చెందిన కుమార్తె సులోచన (ప్రియాంకజైన్‌). తను కాలేజీలో చదువుతోంది. ఓ విషయంలో అపార్థం చేసుకుని రమణ చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ తర్వాత తప్పును తెలుసుకుని క్షమించమని అడుగుతుంది. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రమణ ఆమెను ప్రేమిస్తాడు. ఇందుకు ఆమె ఒప్పుకోదు. విషయం తెలిసి ఆమె బావ రమణను చితగ్గొడతాడు. తన బాధను మర్చిపోవడానికి బీర్‌ కొడుతూ కాలక్షేపం చేస్తాడు. 
 
ఆ సమయంలో ఎవరో తనను పిలుస్తున్నట్లు తనతో ఏదో చెప్పాలనుకుంటున్నట్లు అనిపిస్తుంది. తలుపు శబ్దంతో వచ్చే సిగ్నల్‌ను సూరి అనే వ్యక్తిగా భావించి తనతో అన్ని విషయాలు పంచుకుంటాడు రమణ. ఆ క్రమంలో తనలాగే ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకుంటాడు. ఆత్మ తనతోనే వుందని తెలుసుకుని సూరి ఆఖరి కోరిక తీర్చడానికి బయలుదేరతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది? మరి రమణ ప్రేమ ఫలించిందా! లేదా! అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
ఇదొక టిపికల్‌ ప్రేమకథ. గ్రామంలో జరిగిన కథ. నేటివిటీని కళ్ళకు కట్టినట్లు దర్శకుడు చూపించాడు. అక్కడ వాతావరణం, మనుషుల ప్రవర్తన పూసగుచ్చినట్లు ఆవిష్కరించాడు. లిఫ్ట్‌ ఇచ్చినందుకు యాభై రూపాయలు వసూలుచేసే చిత్రమైన వ్యక్తులు కూడా వుంటారనేది చాలా హాస్యంగా చూపించాడు. కథనంలో అక్కడక్కడా కన్పించే ఇటువంటి సన్నివేశాలు వినోదాన్ని పండించాయి. 
 
ఫ్రెండ్‌ అంటే ఎలా వుండాలనేది కూడా సూరిపాత్రద్వారా చెబుతూనే.. ఎలా వుండకూడదో అనేది కూడా చెప్పేప్రయత్నం చేశాడు. రెండు కోణాల్ని ఆవిష్కరించిన దర్శకుడు తొలిసారి అయినా బాగానే డీల్‌ చేశాడు. కానీ కథనంలో కొంత గందరగోళం కన్పిస్తుంది. లెంగ్త్‌ రీత్యా ఒకటి రెండు సీన్లు ఎడిట్‌ కావడంతో సీన్‌కు లింక్‌ తెగినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమకోసం చంపడం, చావడం రెండూ  తప్పే అనే పాయింట్‌ను స్ట్రెయిట్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందుకు లక్ష్మీభూపాల్‌ సంభాషణలు సహజంగా అమరాయి.
 
నటనాపరంగా శ్రీనివాస్‌ సాయి పలు కోణాల్ని ఆవిష్కరించాడనే చెప్పాలి. ఆహార్యం ఉపేంద్రను తలపించేలా వుండడంతో అతని స్పూర్తిగా తీసుకుని కొన్ని సన్నివేశాల్లో జీవించేశాడు. కుర్రతనం చేష్టలు ఎలా వుంటాయో అతని పాత్ర దర్శకుడు చెప్పించాడు. తను రోజూ మాట్లాడుతుంది కోరిక తీరని ఆత్మతో అనేవిషయాన్ని కూడా తెలీని కుర్రకారుకు నిదర్శనంగా అతని పాత్ర వుంటుంది. ఇక సులోచన పాత్రలో గ్లామర్‌గా నటనాపరంగా ప్రియాంక జైన్‌ ఈజీగా చేసేది. మిగిలిన పాత్రలు తమ పాత్రలకు న్యాయం చేశారు. పతాకసన్నివేశంలోనూ సెంటిమెంట్‌ను బాగా పండించాడు. 
 
గ్రామీణ అందాలను అక్కడి పరిస్థితులను కెమెరామెన్‌ తన పనికి న్యాయం చేశాడు. సంగీతం ఓకే అనిపించేలా వుంది. చేతికి వచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడం వల్ల కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుందనే సందేశాన్ని చెప్పడంతోపాటు బాధ్యతగా ఎలా మెలగాలనేది కూడా చెప్పాడు. అయితే ఇటువంటి పాయింట్‌ను మరింత ఆసక్తికరంగా చెబితే పెద్దస్థాయి సినిమా అయ్యేది. సూరి అనే వ్యక్తిని చూపించకుండా కేవలం శబ్దంతోనే కథను నడపడం కాస్త నిరాశపరుస్తుంది. అక్కడక్కడా చిన్నపాటి లోపాలున్నా ఇప్పటి ట్రెండుకి తగిన చిత్రమిది.
 
మురళీకృష్ణ పెండ్యాల

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"నేనే మొదలు పెట్టాను .. నేనే పూర్తి చేస్తాను" ఐరా ట్రైలర్ (Video)