Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'జూమ్'లో వీడియో కాన్ఫరెన్సా.. వామ్మో.. ఇంకేమైనావుందా?

Advertiesment
Zoom
, గురువారం, 16 ఏప్రియల్ 2020 (20:00 IST)
చైనాకు చెందిన జూమ్ యాప్‌ సాఫ్ట్‌వేర్‌పై ఇప్పటికే అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్ ఏమాత్రం సురక్షితంకాదనే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం ఏమాత్రం సురక్షితంకాదని తేలింది. అందువల్ల ఈ యాప్‌ను ఉపయోగించరాదని స్పష్టం చేసింది.
 
కరోనా వైరస్ పుణ్యమాని ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో అనేక ఐటీ కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది తమ ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోం కారణంగా జూమ్ యాప్‌లలో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం ఎక్కువైపోయింది. అయితే, ఈ సాఫ్ట్‌వేర్ ఏమాత్రం సురక్షితం కాదని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. 
 
దీనికి సంబంధించిన సూచనలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల 12న జారీ చేసింది, వీటిని గురువారం పాత్రికేయులకు వెల్లడించింది. జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారం సురక్షితం కాదని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఈ అడ్వయిజరీలో తెలిపింది. దీనికోసం వాడుతున్న సాఫ్ట్‌వేర్ చైనాలో తయారైనట్లు చెప్తున్నారని, కొన్ని కాల్స్ చైనాలోని సర్వర్లకు మళ్ళుతున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. 
 
ముఖ్యంగా, జూమ్‌ను ఆఫీస్ మీటింగ్‌ల కోసం ఉపయోగించేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ అడ్వయిజరీలలో పేర్కొన్నట్లు వివరించింది. మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాల్లో, 'జూమ్ చాలా ప్రజాదరణ పొందిన వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారం. భద్రత లేకుండా వాడటం వల్ల సమావేశ వివరాలు, సంభాషణలు వంటి సున్నితమైన సమాచారం సైబర్ క్రిమినల్స్‌కు చేరే అవకాశం ఉంది' అని పేర్కొంది.
 
అదేసమయంలో యూజర్లు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలని, 'వెయిటింగ్ రూమ్' ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలని ఈ అడ్వయిజరీ తెలిపింది. 'వెయిటింగ్ రూమ్' ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం వల్ల పార్టిసిపెంట్స్‌పై మేనేజర్లు మెరుగైన నియంత్రణ సాధించేందుకు అవకాశం ఉంటుందని వివరణ ఇచ్చింది. ఇదిలావుండగా, సిటిజన్ ల్యాబ్‌ పరిశోధకులు కొన్ని జూమ్ కాల్స్ చైనాకు మళ్లుతున్నట్లు బయటపెట్టడంతో, ఈ నెల 3వ తేదీన జూమ్ క్షమాపణ చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరింత కఠినంగా లాక్ డౌన్: లవ్ అగర్వాల్