ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక యేడాది పూర్తయింది. ఈ క్రమంలో సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా, మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాబోయే నాలుగేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు మంత్రులు కీలక హామీలు, ప్రకటనలు చేశారు. కడప జిల్లా లింగాల మండలంలో పర్యటించిన మంత్రి సవిత, నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవితో కలిసి ఇంటింటికీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దేవవరంలో హోంమంత్రి అనిత పర్యటించి, ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను గ్రామస్థులకు వివరించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలంలో మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తమ పాలన ఉంటుందని తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చారు.
మరోవైపు, జమ్మలమడుగులో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ప్రతిపక్ష నేత జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా 'రీకాల్ చంద్రబాబు' అంటూ కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.