చిన్న కారణం. ఆ కారణంతో కొందరు ఉన్మాదంతో మరో యువకుడి ప్రాణాలను తీసారు. పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని ఎల్బీ నగర్ దగ్గర ఉప్పల్ ప్రాంతానికి చెందిన మురళి అనే కుర్రాడు కారులో వెళ్తున్న యువకులను లిఫ్ట్ అడిగాడు. అలా కొంతదూరం ప్రయాణించాక ఎన్జీఆర్ఐ దగ్గర అల్పాహారం తినేందుకు కారు ఆపారు. అక్కడ అంతా కలిసి టిఫిన్ చేస్తుండగా ఒక యువకుడిపై పొరబాటున చట్నీ పడింది. దాంతో లిఫ్ట్ ఇచ్చిన తమ మీదే చట్నీ వేస్తావా అంటూ యువకుడు మురళిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.
ఆ తర్వాత అతడిని కారులోనే తిప్పుతూ సిగరెట్లతో కాల్చుతూ హింసించారు. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు బాధితుడు కారు దిగి పరుగులు పెట్టాడు. అప్పటికీ వదలని ఆ ఉన్మాదులు అతడిని వెంబడించారు. అత్యంత దారుణంగా కత్తితో పొడిచి పొడిచి చంపేసారు. అతడు చనిపోయాడని నిర్థారించుకున్న తర్వాత మారణాయుధాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
మల్లాపూర్ కేఎల్ రెడ్డి నగర్ ప్రాంతంలో తమ కారును పార్క్ చేసి అక్కడ నుంచి పారిపోయారు. ఐతే వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారం చేసుకుని పోలీసులు 24 గంటల లోపే నలుగురుని పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు.