దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. శనివారం నుంచి ఈ సేవలు వినియోగదారులకు అందుబాటులో వుంటాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది క్లౌడ్ ఆధారిత నెట్‌వర్క్ అని, భవిష్యత్ అవసరాలకు తగినట్లు 5జీకి సులువుగా అప్‌గ్రేడ్ అవ్వొచ్చని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సేవలను శనివారం ప్రారంభించనున్నారు. పలు రాష్ట్రాల్లో ఒకేసారి ప్రారంభోత్సవం జరగనుందని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలోని జార్సుగూడా నుంచి ఈ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించనున్నారు.
సెప్టెంబర్ 27న బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను దేశవ్యాప్తంగా సుమారు 98 వేల సైట్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం కనెక్టివిటీపై మాత్రమే కాకుండా భారతదేశ టెలికాం తయారీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై కూడా దృష్టి సారించిందని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.
ప్రపంచ సంస్థలు ప్రస్తుతం భారతీయ తయారీదారులతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయని సింధియా అన్నారు. ఇకపోతే.. రెండు త్రైమాసికాల్లో బీఎస్ఎన్ఎల్ లాభాలను నమోదు చేసిందని సింధియా తెలిపారు.