రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ఘోరం జరిగింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న సవాయ్ మాన్‌సింగ్ ట్రామా (ఎస్ఎం) ట్రామా సెంటరులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో మంటలు చెలరేగడంతో ఎనిదిమంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ప్రమాదం సంభవించినపుడు ఐసీయూ వార్డులో 11 మంది చికిత్స పొందతున్నారని ట్రామా సెంటర్ ఇన్‌చార్జ్ అనురాగ్ ధాకడ్ వెల్లడించారు.
కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. మరో 14 మంది రోగులను మరో ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. వార్డులో ఒక్కసారిగా పొగ వ్యాపించడం, మంటలు చెలరేగడంతో రోగులు ఒక్కసారిగా హాహాకారాలు చేయడం మొదలుపెట్టారని తెలిపారు.
దీంతో ఆస్పత్రి సిబ్బంది కొందరు రోగులను సురక్షితంగా బయటకు తరలించారు. కాగా, ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశాయి.