భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని, అందువల్ల ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని, అది ప్రతి పౌరుడి కర్తవ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ రాశారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు.
దేశ పౌరులు తమ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని.. బలమైన ప్రజాస్వామ్యానికి అవే పునాదులన్నారు. భారత రాజ్యాంగం ప్రజలకు ఓటు హక్కును కల్పించిందన్నారు. పౌరులుగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అన్ని ఎన్నికల్లో ఓటు వేయడం వారి కర్తవ్యమన్నారు. మొదటిసారి తమ ఓటుహక్కు వేసే వారితో పాటు అందరికీ స్ఫూర్తినిచ్చేలా ప్రతి ఏడాది నవంబరు 26న పాఠశాల, కళాశాలల్లో రాజ్యాంగ దినోత్సవం జరపాలని పిలుపునిచ్చారు.
యువత ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని, అవి బలమైన దేశానికి పునాది అని అన్నారు. 'ఈ శతాబ్దం ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయ్యాయి. మరో రెండు దశాబ్దాల్లో వలస పాలన నుంచి విముక్తి పొంది 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. 2049కి రాజ్యాంగం ఆమోదించి వందేళ్లు అవుతుంది. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు, సమష్టి చర్యలే.. రానున్న తరాల జీవితాలను రూపొందిస్తాయి. వీటన్నింటి నుంచి ప్రేరణ పొంది.. వికశిత్ భారత్ లక్ష్యంగా వాళ్లు ముందుకుసాగుతారు.
మన రాజ్యాంగం అత్యంత శక్తిమంతమైనది. ఒక సామాన్యమైన, ఆర్థికంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చిన నేను.. 24 ఏళ్లకు పైగా ప్రజలకు సేవలందిస్తున్నాను. 2014లో మొదటిసారి పార్లమెంటుకు వచ్చి.. ఇక్కడి మెట్లను తాకి నమస్కరించిన క్షణాలు ఇంకా నాకు గుర్తున్నాయి. 2019లో ఎన్నికల ఫలితాలు వచ్చాక నేను సంవిధాన్ సదన్‌లోకి అడుగుపెట్టగానే గౌరవంగా రాజ్యాంగాన్ని నుదుటన పెట్టుకున్నాను అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
రాజ్యాంగం పౌరులకు కలలు కనే శక్తితో పాటు వాటిని సాకారం చేసుకునే అవకాశాలను కల్పించిందన్నారు. ఈ గొప్ప దేశం కోసం పౌరులుగా తమ విధులను ప్రతిఒక్కరూ నిర్వర్తించాలని ఉద్ఘాటించారు. అప్పుడే అభివృద్ధి చెందిన, సాధికారత కలిగిన భారత్‌గా రూపొందుతుందన్నారు. ఈసందర్భంగా రాజ్యాంగ నిర్మాతలకు మోడీ నివాళులర్పించారు.