ఐబొమ్మ రవికి సంబంధించిన సమాచారాన్ని భార్య వెల్లడించలేదని, పోలీసులు పంపిన మెయిల్స్‌కు స్పందించి వలలో చిక్కాడని పోలీసులు వెల్లడించారు. సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించగా, అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సాంకేతిక అంశాలపై పట్టున్న ఇమంది రవి పైరసీ సినిమాలకు అవసరమైన ఐబొమ్మ, బప్పం టీవీ డొమైన్లను ఎన్జిలా కంపెనీలో రిజిస్ట్రేషన్ చేశాడు. సీఎంఎస్ ద్వారా పైరసీ వెబ్సైట్లను నిర్వహించాడు. యూజర్లు వాటిని క్లిక్ చేయగానే సినిమా చూసే ముందుగా గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల్లో రీడైరెక్ట్ అయ్యేలా ఏర్పాటు చేశాడు. దాని ద్వారా గేమింగ్, బెట్టింగ్ వెబ్సైట్లను ట్రాఫిక్ పెంచుకుని రూ.లక్షల్లో ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ డబ్బులు డాలర్ల రూపంలో రవికి చెందిన యాడ్బుల్ కంపెనీ ఖాతాలో జమయ్యేవి. గేమింగ్, బెట్టింగ్ వెబ్సైట్లకు ప్రచారం కల్పించి ఎంతో మంది నష్టపోయేందుకు, బలవన్మరణాలకు కారకుడయ్యాడని ఏపీకే ఫైల్స్‌తో బ్యాంకు ఖాతాలకు నష్టం, డేటా విక్రయించి పౌరుల వ్యక్తిగత భద్రతను ప్రమాదంలో పడేశాడని అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు. పైరసీ సినిమాలను భద్రపరిచేందుకు నిందితుడు నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌లో సర్వర్లు ఉపయోగించాడు. కరేబియన్ దీవుల్లో ఆంక్షలు లేకపోవటంతో రూ.80 లక్షలతో అక్కడి పౌరసత్వం తీసుకున్నాడు.
రవి ప్రారంభించిన గెట్టింగ్ అప్ యాప్ కంపెనీ పేరుతోనే డొమైన్లు నిర్వహించాడు. వాటికి తానే నోడల్ అధికారినంటూ పోలీసులు పంపిన మెయిల్‌కు స్పందించాడు. ఐబొమ్మ, బప్పం డొమైన్లలో పైరసీ సినిమాలున్నట్టు ఆధారాలు చూపాలంటూ బెదిరించాడు. అనుమానంవచ్చిన పోలీసులు గెట్టింగ్అప్లో లభించిన ఫోన్‌నంబర్ ఆధారంతో కూపీ లాగితే తమను ఆధారాలు అడిగిన నోడల్ అధికారే అసలు నిందితుడిగా నిర్ధారణకు వచ్చి అరెస్టు చేసినట్టు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.