Publish Date: Tue, 02 Apr 2019 (19:19 IST)
Updated Date: Tue, 02 Apr 2019 (19:20 IST)
ఉన్నత విద్య చదవాలని చాలా మంది కోరిక. అలాంటి ప్రయత్నం చేసినందుకు గానూ ఓ బాలికను కొంతమంది దుండగులు చంపేశారు. ఈ దారుణ సంఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ జిల్లాలోని సాన్పూరా గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఆశ(17) అనే అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతోంది.
అయితే వీరి తెగ ఆచారాల ప్రకారం అమ్మాయిలు పదో తరగతి వరకు మాత్రమే చదవాలి. ఆ తర్వాత చదవకూడదు. కానీ ఆశ మాత్రం ఇంటర్మీడియట్‌లో చేరింది. దీంతో ఆ తెగకు చెందిన ఏడుగురు వ్యక్తులు ఆశ ఉన్నత విద్య చదవడం ఇష్టం లేక ఆమెను దారుణంగా చంపేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
అయితే ఆశ సోదరుడు బాబన్ రాయ్ ఆదివారం సాయంత్రం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఏడుగురు వ్యక్తులలో నలుగురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.