Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షిర్డీ సాయినాధుడు ప్రసాదించిన ఊదీ మహిమ తెలుసా?

Advertiesment
Significance of Shirdi Sai
, బుధవారం, 28 నవంబరు 2018 (20:34 IST)
సర్వరోగనివారిణి బాబా చరిత్రలో ఊదీకి సంబంధించి మహిమలు అడుగడుగునా కనిపిస్తాయి. ఊదీని కలిపిన నీటితో మూర్ఛరోగం తగ్గడం, ఊదీతో ప్లేగు వ్యాధి ఉపశమించడం, రాచకురుపుతో బాధపడుతున్నవారు సైతం ఊదీతో స్వస్తత చెందడం... ఇలా సచ్చరిత్రలో అడుగడుగునా ఊదీ వైభవం కనిపిస్తుంది. కానీ దానికి కారణం తాను కాదంటూ వినమ్రంగా చెబుతారు బాబా. నేను భగవంతుడను కాను. ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారినెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తన అహంకారమును పక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములు వీడి మోక్షమును పొందెదరు అన్నది బాబా మాట.
 
ఊదీతో నయమయ్యే రోగాల గురించే కాదు, ఆపత్కాలంలో ఊదీతో తీరిన కష్టాల గురించి కూడా సచ్చరిత్రలో ప్రస్తావన వస్తుంది. బాలాజీ నేవాస్కరు అనే భక్తుడు తన జీవితాంతం బాబాను తలుచుకుంటూ, కొలుచుకుంటూ గడిపేశాడు. అలాంటి బాలాజీ సంవత్సరీకాన్ని అతని కుటుంబం శ్రద్ధగా నిర్వహించాలనుకుంది. కానీ నేవార్కరు కుటుంబం ఊహించినదానికంటే మూడురెట్లు బంధువులు ఆ సంవత్సరీకానికి వచ్చారు. వంటకాలు చూస్తేనేమో వారిలో మూడోవంతుకి మాత్రమే సరిపోయేట్లు ఉన్నాయి. 
 
ఆ పరిస్థితి చూసి బాలాజీ భార్య గాభరా పడిపోయింది. కానీ అతని తల్లి మాత్రం ఆ వంటకాలన్నింటి మీదా కాస్త ఊదీని చల్లి, వాటిని గుడ్డతో మూసివేయమని సలహా ఇచ్చింది. ఇది సాయి ఆహారమేననీ! ఆయనే తమను ఆ స్థితి నుంచి కాపాడతాడనీ... అభయమిచ్చింది. బాలాజీ తల్లి నమ్మకం ప్రకారమే వండిన పదార్థాలు అందరికీ సరిపోవడమే కాకుండా... ఇంకా మిగిలిపోయాయి కూడా....
 
ఊదీ అంటే బాబా ధునిలో నిత్యం కాలే కట్టెల బూడిదే కాదు. అవసరమైనప్పుడు బాబాను తల్చుకుని దాల్చినదేదైనా ఊదీ సమానమైన మహిమతో నిండిపోతుంది. బూడిదనే నమ్ముతున్నప్పుడు ఇక అందులో గుణగణాల ప్రస్తావన ఎందుకని ఉంటుంది? అందుకే బాబా భక్తుడైన నారాయణరావు, తన స్నేహితుడు తేలు కాటుతో విలవిల్లాడిపోతున్నప్పుడు గాయం మీద రాసేందుకు ఊదీ కోసం వెతికాడు. కానీ ఎంతకీ ఊదీ కనిపించకపోవడంతో... అగరువత్తి నుంచి రాలిన బూడిదనే ఊదీగా భావించి తన స్నేహితుడి గాయానికి రాశాడు.
 
నారాయణరావు ఇలా బూడిదను గాయానికి అంటించి, అలా చేతిని పైకి తీయగానే నొప్పి మాయమైపోయింది. ఇలాంటి సంఘటనే నానా సాహెబు హయాంలోనూ జరిగింది. నానాసాహెబు ఒకనాడు ఠాణా రైల్వేస్టేషనులో నిల్చొని ఉండగా, తన స్నేహితుని కుమార్తె ప్లేగు వ్యాధితో బాధపడుతున్న కబురు తెలిసింది. వెంటనే రోడ్డు మీద ఉన్న కాస్త మట్టిని తీసుకుని, సాయిని తల్చుకుని, తన ఎదురుగా ఉన్న భార్య నుదుటి మీద రాశారు. అంతే ఆ క్షణం నుంచే తన స్నేహితుని కుమార్తెలో రోగలక్షణాలు సద్దుమణిగిపోయినట్లు తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహానంది దివ్యచరిత్ర... తెలుసా?