Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పండుగకు సొంతూళ్ళకు వెళుతున్నారా.. అయితే మాకు చెప్పండి.. : టీజీ పోలీసులు

Advertiesment
telangana police

ఠాగూర్

, గురువారం, 9 జనవరి 2025 (08:43 IST)
సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ పోలీసులు ఓ విజ్ఞప్తి చేసారు. పండుగ కోసం ఊర్లకు వెళ్లే నగర వాసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా, ఇంటి పరిసరాల్లో సీసీ టీవీ కెమెరాలు అమర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల ఇళ్ళలో చోరీలను నివారించవచ్చని పేర్కొన్నారు. 
 
తెలుగు ప్రజల అతి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. అంతేకాకుండా చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు. ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య ఇతరత్రా వ్యవహారాలతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఈ పండుగ కోసం సొంతూళ్లకు తరలివచ్చి తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతుంటారు.
 
ఈ కారణంగా నగరాల్లో సగానికిపైగా ఇళ్లకు తాళాలు వేసి ఉంటాయి. ప్రజలు సొంతూళ్ల బాట పట్టడంతో నగరాల్లోని పలు ఏరియాలు జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తుంటాయి. ఇదే అదునుగా ఇంటి దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో పండుగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు.
 
తాళం వేసిన మీ ఇంటిని దొంగల నుంచి కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, వాటి పనితీరును పరిశీలించుకోవాలని, ఇంట్లో లైట్లు వేసి వెళ్లాలని, బంగారం, నగదు వంటి విలువైన వస్తువులు ఇళ్లలో ఉంచవద్దని, తాళం వేసిన సంగతి తెలియకుండా కర్టెన్ వేసి ఉంచాలని, పక్కింటివారికి సమాచారం ఇవ్వాలని, బీరువా తాళాలు ఇళ్లలో పెట్టవద్దని పోలీసులు సూచనలు చేశారు.
 
ఊరెళ్లే వారు తమ అడ్రస్, ఫోన్ నెంబర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని, విలువైన వస్తువులు ఇళ్లలో ఉంచవద్దని, వాహనాలను రోడ్డు బయట కాకుండా ఇంటి ఆవరణలో పార్క్ చేసుకోవాలని, సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైనులో చూసుకుంటూ ఉండాలని తదితర సూచనలు చేశారు. ఈ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tirupati Stampede తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లకై తొక్కిసలాట: ఆరుగురు భక్తులు మృతి