Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకంపం: ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆ రెండు జిల్లాలు తప్ప మిగతా ప్రాంతమంతా సేఫ్ జోన్‌లోనే’

బిబిసి
బుధవారం, 4 డిశెంబరు 2024 (22:05 IST)
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. ప్రధానంగా విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. విజయవాడ పటమట, సింగ్‌నగర్‌లోని నందమూరి కాలనీ, తోట వారి వీధి, గుంటూరు జిల్లా తాడేపల్లి సహా పలు ప్రాంతాల్లో ఉదయం 7.27 గంటలకు ఇళ్లల్లోని మంచాలు, సామాన్లు రెండు మూడు సెకండ్ల పాటు కదలడంతో జనం ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఒకటో వార్డులోని చామర్తి రామకోటేశ్వరరావు ఇంట్లో గోడలకు పగుళ్లు వచ్చాయి. తొలుత ప్రజలెవరూ భూకంపంగా భావించలేదు. కొద్ది నిమిషాల తర్వాత టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో భూకంపం వార్తలు రావడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే.. ఆస్తినష్టం, ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
 
డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసులోనూ ప్రకంపనలు
తాడేపల్లిలో ఉన్న రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంతో పాటు, దీనికి సమీపంలోని తమ అపార్ట్‌మెంట్‌లో కూడా భూకంపం ప్రభావం కనిపించిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ బీబీసీతో చెప్పారు. అయితే ఇది చాలా స్వల్ప స్థాయి భూకంపమని, ఎవరూ కంగారుపడాల్సిన పని లేదని ఆయన తెలిపారు. ‘‘బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నుంచి విశాఖ జిల్లా వరకు సంభవించిన భూప్రకంపనలు రిక్టర్ స్కేలుపై మూడు పాయింట్ల లోపే (2.9) నమోదయ్యాయి. రాష్ట్రంలో పలు చోట్ల రెండు నుంచి మూడు సెకన్లు మాత్రమే భూమి కంపించింది. ఇది ఫీబుల్‌ స్థాయిగా నిర్ధారణ అయింది. తెలంగాణ ములుగు జిల్లాలో 5.3 తీవ్రత నమోదు కాగా, ఏపీలో రాజమండ్రి నుంచి 270 కిలోమీటర్లు వాయువ్య దిశలో దాని ప్రభావం 2.9గా గుర్తించాం’’ అని తెలిపారు.
 
సేఫ్ జోన్‌లో ఏపీ
ఏపీలో చాలా స్వల్ప స్థాయిలో భూమి కంపించిందని, 12 స్థాయిలతో కూడిన భూకంప తీవ్రత జాబితాలో ఇది రెండో స్థానమేనని కూర్మనాథ్ వెల్లడించారు. దీన్ని ఫీబుల్ స్థాయి అని పిలుస్తారని ఆయన చెప్పారు. ఫీబుల్ స్థాయిలో భూకంపం సంభవిస్తే ఎటువంటి ప్రమాదాలకు అవకాశం ఉండదని కూర్మనాథ్‌ వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని భరోసానిచ్చారు. సిస్మిక్‌ జోన్‌ పరంగా చూసినా ఏపీ సేఫ్‌ జోన్‌లోనే ఉందని తెలిపారు. ప్రకాశం, పల్నాడు జిల్లాలపై మాత్రం ఒకింత ప్రభావం చూపించే అవకాశాలున్నాయని ఆయన భావించారు. భూకంపం వచ్చినప్పుడు ప్రజలు ఇళ్లల్లో ఉండకుండా బయటకు వచ్చేస్తే నష్టం ఉండదని కూర్మనాథ్‌ చెప్పారు.
 
ప్రకంపనలు రాగానే ఇంటి నుంచి బయటకు వచ్చేశా: ములుగు కలెక్టర్ దివాకర్
భూకంప కేంద్రం ఉన్న తెలంగాణలోని ములుగు జిల్లాలో ప్రకంపనల తరువాత అధికారులను అప్రమత్తం చేసినట్లు ఆ జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ చెప్పారు. ఉదయం 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో తాను కూడా ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించానని.. వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని కలెక్టర్ చెప్పారు. వెంటనే జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడైనా ఎలాంటి నష్టమైనా జరిగితే తెలియజేయాలని అధికారులకు సూచించానని చెప్పారు.
 
‘‘రేకుల చప్పుడు విన్నాం.. కోతులు వచ్చాయనుకున్నాం’’
‘‘ఉదయం ఏడున్నర గంటలప్పుడు మంచం కదిలింది. రేకులు శబ్దం వచ్చింది. అది విని కోతులు వచ్చాయని అనుకున్నాం’’ అని తిరువూరులో భూకంపం ప్రభావానికి గోడలు నెర్రెలిచ్చిన ఇంటి యజమాని చామర్తి రమాదేవి చెప్పారు.
 
‘‘బాత్రూంలో అద్దం కదులుతోందని మా ఆవిడ భయపడింది’’
విజయవాడ నందమూరినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న నివాస్ కూడా తన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు. ‘‘ఉదయం 7:27 గంటలకు మంచం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. నేను ఏమిటా అని ఆలోచిస్తుండగా నా భార్య వచ్చి బాత్‌రూంలో ఉన్న అద్దం దానంతట అదే కదులుతోందని కంగారుపడుతూ చెప్పింది. 8 గంటల తర్వాత టీవీలో భూకంపం వార్తలు చూసిన తర్వాత, ఇదంతా భూకంపం వల్ల అని మాకు అర్థమైంది’’ అని మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేసే నివాస్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments